విదేశీ మెషిన్లతో పేదలకు ఖరీదైన వైద్యం ... అధికారుల అనుమతి తప్పనసరి

Expensive foreign implants used for Poor Patients
దేశీయ ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దిగుమతి ఇంప్లాంట్ అవసరమా? లక్నో కేజీఎంయూలో కొత్త నిబంధన
మన తెలంగాణ, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య పరికరాల వినియోగంపై లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, నిరుపేదలు, ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన ఆరోగ్య యోజన లబ్ధిదారులకు చికిత్సలో ఖరీదైన విదేశీ ఇంప్లాంట్లు వినియోగించాలంటే ఇకపై ఆస్పత్రి ఉన్నతాధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి చేసింది. కేజీఎంయూ పరిధిలోని హాస్పిటల్ రివాల్వింగ్ ఫండ్ నుంచి విదేశీ లేదా అధిక ధర కలిగిన ఇంప్లాంట్లను అనుమతి లేకుండా జారీ చేయకూడదని ఆస్పత్రి ఆదేశించింది. దీంతో వైద్యులు రోగికి ఇలాంటి ఇంప్లాంట్ అవసరమని భావిస్తే, దానికి కారణాలను పేర్కొంటూ ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ది ట్రిబ్యూన్ ఇండియా కథనం
దేశీయ ఇంప్లాంట్ ఉన్నా.. విదేశీదే అవసరమా?
ఈ నిర్ణయం ప్రభుత్వ నిధులతో అందించే వైద్యంలో ఖర్చు, వైద్య అవసరం మధ్య సమతుల్యతపై చర్చకు దారితీసింది. ఒకే వైద్య అవసరానికి దేశీయంగా తయారైన ఇంప్లాంట్ అందుబాటులో ఉన్నప్పుడు, దానికంటే ఖరీదైన విదేశీ ఉత్పత్తిని ఎప్పుడు ఉపయోగించాలి? ఆ నిర్ణయం వైద్యుడిదా? లేక ఆస్పత్రి ఉన్నతాధికారులదా? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. వైద్యుల దృష్టిలో కొంతమంది రోగులకు విదేశీ ఇంప్లాంట్ ప్రత్యేక వైద్య కారణాల వల్ల అవసరం కావచ్చు. అయితే ప్రజా నిధులతో నడిచే ఆరోగ్య పథకాల కింద చికిత్స పొందుతున్న రోగుల విషయంలో అధిక వ్యయాన్ని నియంత్రించాల్సిన అవసరం కూడా ఉందన్నది ఆస్పత్రి నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది.
పేద రోగులపై ప్రభావం?
పిఎం జెఎవై వంటి పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఖరీదైన చికిత్స అందుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఇంప్లాంట్ ఎంపికలో రోగికి అవసరమైన వైద్య ప్రమాణాలు, ఇంప్లాంట్ నాణ్యత, దీర్ఘకాలిక ఫలితాలు, ఖర్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేజీఎంయూ తాజా ఆదేశం ఈ అంశంపై ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది. ప్రభుత్వ నిధులతో వైద్యం అందుతున్నప్పుడు ఖరీదైన చికిత్సా ఎంపిక నిజంగా వైద్యపరంగా అవసరమా, లేక అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయం సరిపోతుందా అన్నది ఎలా నిర్ణయించాలి?. ఈ నిర్ణయం అమలులో వైద్య అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే, అనవసరమైన అధిక వ్యయాన్ని నియంత్రించడం ఇప్పుడు ఆస్పత్రి యంత్రాంగానికి ప్రధాన సవాలుగా మారనుంది.
-
Home
-
Menu
