ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చిన వివాహేతర సంబంధం

Extra-marital sexual relationship
నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని సంజాపూర్‌లో వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గామానికి చెందిన గుర్రం మల్లేష్‌కు వెల్దండ మండలం, చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. మల్లేష్ మున్సిపాలిటీ పరిధిలోని సిలార్‌పల్లికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . ఈ విషయమై మల్లేష్, అతని భార్య శిరీషకు గతంలో గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దమనుషులు గతంలో భార్యాభర్తలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
కానీ మల్లేష్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ భార్య శిరీషను, కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు.ఈ క్రమంలో శిరీష బంధువులు చెరుకూరు గ్రామానికి చెందిన శివ ప్రశాంతు, రామకృష్ణ, వెంకటేష్, సుభాష్, నరేష్ బుధవారం మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడంతో వారు మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేల, తమ్ముడు పరమేష్‌పై విచక్షణారహితంగా ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘర్షణలో జంగయ్య అలివేల, పరమేష్ పరిస్థితి విషమంగా మారింది. వీరిలో జంగయ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సిఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
