విద్యుత్ సరఫరా లేక ఎండిన పంట..మూడు ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

విద్యుత్ సరఫరా సరిగా లేక మూడు ఎకరాల వరి పంట ఎండిపోవడంతో కౌలు రైతు యాతాకుల మల్లయ్య తీవ్ర ఆవేదనలో తన పంటకు నిప్పు పెట్టిన ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఎకరాకు సుమారు రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టాడు. పొలంలో నీటి వనరు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నీరు అందగా, మిగిలిన మూడు ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది.
కౌలు, పెట్టుబడి భారం ఒకవైపు, చేతికి రూపాయి కూడా రాని పరిస్థితి మరోవైపు ఉండటంతో దిక్కుతోచని స్థితిలో ఎండిపోయిన పంటను కాల్చివేసినట్లు మల్లయ్య వాపోయాడు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే బూడిద కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపాడు. ఈ ఘటనతో మండలంలోని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగుకు కీలకమైన విద్యుత్ సరఫరా లోపాలు రైతులను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి తగిన పరిహారం అందించడంతో పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
