విద్యుత్ కోతలపై భగ్గుమన్న రైతన్నలు

విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు మల్దకల్ మండల కేంద్రంలోని ఐజ గద్వాల్ ప్రధాన రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో అయిజ - గద్వాల్ ప్రధాన రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మల్దకల్ ఎస్ఐ కొండ శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం రైతుల సమస్యలను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రైతులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల విద్యుత్ శాఖ ఏఈ రాజేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ రాజేష్ మాట్లాడుతూ.. రైతుల విద్యుత్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. పంటలు చేతి కొచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, దామ వెంకటేష్, బిఆర్‌ఎస్ పటేల్ జనార్దన్ రెడ్డి, రైతులు గజ్జలన్న, తిమ్మప్ప, మంగళ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
