తండ్రి చేతిలోనే బాలుడి జీవితం విషాదాంతం.. అసలేం జరిగింది?

తండ్రి చేతిలోనే బాలుడి జీవితం విషాదాంతం.. అసలేం జరిగింది?
X

డబ్బు దొంగతనం ఆరోపణ.. 15 ఏళ్ల కొడుకును స్తంభానికి కట్టి కొట్టి చంపిన తండ్రి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఔటయ్యా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు దొంగతనం చేశాడన్న ఆరోపణతో 15 ఏళ్ల కుమారుడిని తండ్రి స్తంభానికి కట్టి కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుర్వా సోమవంశీ గ్రామంలో ఉమ్మేద్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి జీవించేవాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చి డబ్బులు దొంగలిచ్చాడని తన కుమారుడు రిషు అలియాస్ ఇషుతో గొడవకు దిగాడు. కుమారుడిని తాడుతో స్తంభానికి కట్టేశాడు. అనంతరం వెదురు కర్రతో తీవ్రంగా కొట్టడంతో బాలుడు మృతి చెందాడు. దాడి అనంతరం బాలుడి మృతదేహాన్ని మంచంపై ఉంచి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఉమ్మేద్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనలో ఉపయోగించిన తాడు, వెదురు కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో డబ్బు దొంగతనం విషయంలో తన కుమారుడితో తరచూ గొడవలు జరిగేవని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు.


Tags

Next Story