సాధించాడు.. ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫుట్‌బాల్ క్రీడను నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఫిఫా కొత్తగా ఏర్పాటు చేసిన “శాంతి బహుమతి” (పీస్ ప్రైజ్) ని ఆయన అందుకున్నారు. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీ లోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. శుక్రవారం జరిగిన డ్రా వేడుకల్లో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ఈ పురస్కారాన్ని ట్రంప్‌కు ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, ఐక్యతను ప్రోత్సహించేందుకు ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్టు ఇన్ఫాంటినో తెలిపారు.
ఈ సందర్భంగా ట్రంప్‌కు బంగారు పతకం, ఆయన పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీని బహూకరించారు. “ ఒక నాయకుడి నుంచి మనం కోరుకునేది ఇదే. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కావాలి. ఇది మీ బహుమతి, మీ శాంతి బహుమతి ” అని ఇన్ఫాంటినో ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ పురస్కారం అందుకోవడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో లభించిన గొప్ప గౌరవాలలో ఒకటని పేర్కొన్నారు. “అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగోశాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ. కాంగోరువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారు. మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాను. ఇది ఎంతో గర్వకారణం.
అంతేకాకుండా ఇండియాపాకిస్థాన్ యుద్ధాన్ని సైతం నేనే ఆపాను. నాచర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్దాలు ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రాంరంభం కాకముందే ముగిశాయి” అని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ ఫుట్‌బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5 న ప్రకటించింది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఈ బహుమతి ఫిఫా గౌరవాన్నిమాత్రమే పెంచదని, 500 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల తరఫున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆశలు వమ్ము చేస్తూ నార్వే నోబెల్ కమిటీ వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు ప్రకటించింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైన విషయం తెలిసిందే. ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుందన్న విమర్శలు వస్తున్నాయి.
శాంతి బహుమతిపై విమర్శలు
ట్రంప్‌నకు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫిఫాబాడీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు ,జూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్టు తెలిపింది.
48 జట్లు.. 12 గ్రూపులు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికాలు ఈసారి ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. జులై 19న న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫిఫా చరిత్ర లోనే తొలిసారి 48 జట్లు గ్రూప్ స్టేజీలో తలపడబోతున్నాయి. మొత్తం 12 గ్రూపులు విభజించగా, ఒక్కో గ్రూపులో నాలుగేసి దేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే 42 జట్లు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లకు అర్హత సాధించగా, 22 జట్లు మిగతా ఆరు స్తానాల కోసం బరిలో దిగనున్నాయి.
-
Home
-
Menu
