ఎలక్ట్రికల్ స్కూటర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

ఫ్యూర్ ఎనర్జీ ఈవీ స్కూటర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కంది మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చింది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్లను భారీ స్థాయిలో అక్కడికి తెప్పించారు. సుమారు నాలుగు నుంచి ఐదు గంటలపాటు సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న నైట్ షిఫ్ట్ సిబ్బంది పక్క బ్లాక్‌లోని బ్యాటరీలు, ఇతర సామగ్రిని దూర ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
-
Home
-
Menu
