కొండగట్టులో 30 దుకాణాలు బుగ్గి

కొండగట్టులో 30 దుకాణాలు బుగ్గి
X

అర్ధరాత్రి అగ్రిప్రమాదం

2 గంటల పాటు ఎగిసిపడిన మంటలు

ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక వాహనం

కాలిబూడిదయిన షాపులు

బాధితుల కన్నీరుమున్నీరు

ఆదుకుంటామని మంత్రులు అడ్లూరి, పొన్నం భరోసా

ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి/మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో ఓ దుకాణంలో మంటలు లేచి పక్కనున్న దుకాణాలన్నింటికీ మంటలు వ్యాపించి అందులోని సామగ్రి కాలి బూడిదైంది. సుమారు రెండు గంటల పా టు మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలోని జనమంతా భయంతో రోడ్డు పైకి వచ్చి హాహాకారాలు చేశారు. ఉవ్వెత్తున మంటలు లేవడంతో మంటలను ఆర్పే పరిస్థితి లేకుండా పోయింది. జగిత్యాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వెంటనే రావాల్సిన ఫైర్ సిబ్బంది గంటన్నర ఆలస్యంగా రావడంతో అప్పటికే దుకాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం లో కళ్ల ముందే తమ దుకాణాలు తగలబడి మంటల్లో లక్షల రూపాయల విలువ చేసే సామగ్రి అంతా కాలిపోవడంతో రోడ్డున పడ్డ మమ్మల్ని ఆదుకునేవారెవరు... తాము బతికేదెట్లా అంటూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అంతా బతుకుదెరువు కోసం వచ్చిన వారే...

అగ్ని ప్రమాదంలో దుకాణాలు కాలిపోయిన బాధితులంతా వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం కొండగట్టుకు వచ్చిన వారే. కొందరు ఇళ్లను అద్దెకు తీసుకుని దుకాణాలు నిర్వహిస్తుండగా, మరికొందరు స్థలాలను అద్దెకు తీసుకుని షెడ్డు నిర్మించుకుని దుకాణాలను నిర్వహిస్తున్నారు. అప్పు సప్పు చేసి దుకాణాల్లోకి సామగ్రిని తెచ్చుకుంటే రెండు గంటల్లోనే అగ్నికి అహుతై బుగ్గి కావడంతో బతికేదెట్లా... తమను ఆదుకునేదెవరు అంటూ బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో అన్ని కాలిపోయాయని, కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభు త్వం ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు.

కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణా లు కాలిపోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఫోన్‌లో ఆదేశించారు. అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరమని, బాధితులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.

Tags

Next Story