గోదావరిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతు

భద్రాచలం పట్టణంలో పెను విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం పరిధిలో కొల్లుగూడెం గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన వీరు నదిలో స్నానాలకు దిగగా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి లోని ఎస్‌ఆర్‌ఎంటీ (ఎస్ ఆర్ ఎమ్ టి) కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్‌లతో కలిసి ఎటపాక మండలం లోని పురుషోత్తమపట్నం గ్రామ శివారులో ఉన్న కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరి నది లోకి దిగారు. ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్‌లుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ముగ్గురి మృతదేహాలు లభ్యం గోదారి నదిలో గల్లంతైన వారిలో సాయంత్రం ఐదు గంటలకే మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలింపు చర్యలను చేపట్టారు. లభ్యమైన మృతదేహాలలో భద్రాచలం పట్టణానికి చెందిన చారు గుండ్ల శ్రీకర్ అభిరామ్ ఉయ్యూరుకి చెందిన నవదీప్ మృతదేహాలు లభ్యం కాగా భద్రాచలం పట్టణంలో విషాదఛాయలు అనుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఆర్‌ఎంటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నదీ ప్రమాదంలో మృతి చెందడంతో వారి స్నేహితులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఉదయమే రామాలయ దర్శనానికి వచ్చి సంప్రదాయ వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారని మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
మృతి చెందిన ఐదుగురిలో ఇద్దరు భద్రాచలం పట్టణానికి చెందిన వారు కాగా అందులో ఒకరు సీనియర్ పాత్రికేయులు ఎయిర్‌టెల్ రామకృష్ణ కుమారుడు కాగా మరొకరు ఇటీవలే సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అర్చకత్వాన్ని అభ్యసిస్తున్న యువకుడు అభిరామ్ అని తెలిసింది. కొలిగుడం వద్ద ఇటీవల ఇసుకను తోడేయడంతో గోదావరి లోతుపై సరైన అంచనా లేకనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. స్నానాల కోసమని నదిలో దిగి సరదాగా సెల్ఫీలు దిగే సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదంలో బయటపడ్డ ఇద్దరు యువకులు తెలిపారు. కళ్ళముందే తన స్నేహితులు నీళ్లలో మునిగిపోవడం కనిపించిందని తీవ్రమైన రోదనతో ఆ యువకులు విలపించారు.
-
Home
-
Menu
