ఉపాధికి ఊతం..తయారీకి ఏతం!

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్ కు బడ్జెట్ సమర్పించనున్నారు. లోక్‌సభలో ఉదయం 11గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుకానుంది. సీతారామన్‌కు వరుసగా ఇది తొమ్మి దో బడ్జెట్ కావడం విశేషం. వృద్ధి వేగాన్ని కొనసాగించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, ప్రపంచంలో నెలకొన్న వాణిజ్య పరమైన ఘర్షణల నుంచి ఆ ర్థిక వ్యవస్థను బలోపేతం చేయగల సంస్కరణలను 202627 బడ్జెట్‌లో నిర్మల ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. భారీ ఆదాయపు పన్ను, జిఎస్‌టి కోతలు, మౌలిక సదుపాయాలపై ఖర్చు, ఆర్‌బిఐ వడ్డీ రేటు తగ్గింపులు ఇవన్నీ భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50శాతం ప్రతీకార సుంకాలను తట్టుకోవటానికి ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ వేగాన్ని కొనసాగించడానికి సకారాత్మక చర్యలతో ఆర్థికమంత్రి ముందుకు వస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ.. ఈ సారి బడ్జెట్‌లో ప్రధానంగా తయారీ రంగాలకు మరింత ఊతం, ఉపాధి కల్పనపై నిర్మల ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారని తెలుస్తోంది. ద్రవ్య లోటును తగ్గించే మార్గాన్ని అనుసరిస్తూనే వినియోగాన్ని పెంచడానికి, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడానికి, మూలధన వ్యయాన్ని పెంచడంలో ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిర్మల ముందున్న అతిపెద్ద సవాలు కొత్త వృద్ధి చోదకాన్ని కనుగొనడడమేని చెబుతున్నారు. తీవ్ర అనిశ్చితి, మార్కెట్ల పతనం, వస్తువుల ధరలు నిరంతరం పెరుగుదల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యం కలవరపరుస్తోంది. అమెరికాతో భారత వాణిజ్య చర్చలపై అనిశ్చితి ఆర్థిక మార్కెట్లను అస్థిరపరిచినందున విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలను విక్రయించడం కొనసాగించడంతో పాటు రూపాయి విలువను కనిష్ట స్థాయికి నెట్టివేయడంతో, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించే కష్టమైన పనిని కూడా సీతారామన్ ఎదుర్కొంటున్నారని ఆర్థికవేత్తలు తెలిపారు.ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాన వనరులుగా చమురు ధరలను ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునే వీలుందని పేర్కొంటున్నారు.
దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి నిబంధనలను సరళీకృతం చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంపై ఆమె దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలకు కొత్త పథకాలు, కేటాయింపుల వెల్లువ ఉంటుందని తెలుస్తోంది.మూలధన వ్యయం బడ్జెట్‌కు మూలస్తంభం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పట్టణ మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ పై ఖర్చును గణనీయంగా పెంచింది. వడ్డీ లేని రుణాల ద్వారా రాష్ట్ర స్థాయి మౌలిక సదుపాయాలకు నిరంతర మద్దతుతో రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ప్రసారం, రక్షణ మరియు పట్టణ రవాణాను ప్రాధాన్యత రంగాలుగా చూస్తోంది.పన్ను విషయంలో భారీ మార్పులు అసంభవంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నులలో స్థిరత్వం, అంచనాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు ఏవైనా సర్దుబాట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇది వినియోగానికి మద్దతుగా మధ్యతరగతిపై భారాన్ని తగ్గించడం ద్వారా ఊరట కలిగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు సమచారం.కార్పొరేట్ పన్ను రేట్లు కూడా మారే అవకాశాలు లేవని, డిజిటలైజేషన్ మరియు డేటా ఆధారిత అమలు ద్వారా పన్ను ఆధారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది.ఉపాధి రంగాకలకు ప్రోత్సాహకాలతో ఉద్యోగ కల్పన ప్రముఖంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఇ) మద్దతు ఇచ్చే పథకాలు, మెరుగైన కేటాయింపులు లేదా క్రెడిట్-హామీ మద్దతును నిర్మల ప్రకటించే అవకాశాలున్నాయి. ఉత్పాదక సామర్థ్యం, ఎగుమతులు మరియు ఉపాధిపై వాటి ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేస్తున్నందున ఉత్పత్తి- అనుసంధానిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకాలకు కూడా ఊతం లభించనుంది.
-
Home
-
Menu
