అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య

అటవీ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
X

బొలాంగిర్‌: ఒడిశాలోని బొలాంగిర్‌లో ఓ అటవీ శాఖ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం రేంజ్‌ కార్యాలయం సిబ్బంది క్వార్టర్స్‌లో ఆయన మృతదేహం కనిపించింది. మృతుడిని బ్యాసదేవ్‌ సాహుగా గుర్తించారు. ఆయన బొలాంగిర్‌లోని తికాదర్‌పడ రేంజ్‌లో పనిచేస్తున్నారు. రేంజ్‌ కార్యాలయం వెనుక ఉన్న సిబ్బంది క్వార్టర్స్‌ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే సాహు ఆత్మహత్యా లేదా ఇతర కారణాలతో చనిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా, సాహు కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నతాధికారుల ఒత్తిడి, వేధింపులే ఆయన మృతికి కారణమని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు కారణాలను వెలికితీయాలని వారు డిమాండ్‌ చేశారు. “గతంలో కార్యాలయంలో వేధింపుల గురించి విన్నాను. మానసిక వేధింపులే ఆయన మృతికి కారణమై ఉండొచ్చు” అని సాహు సోదరుడు సుఖ్‌దేవ్‌ సాహు ఆరోపించారు.

అయితే కుటుంబ సభ్యుల ఆరోపణలను డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ (డీఎఫ్‌ఓ) అజిత్‌ బిసి ఖండించారు. సాహుపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఈ విషయంపై ఆయన నుంచి గతంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.సాహు మంచి ఉద్యోగి అని, విధులను బాధ్యతగా నిర్వహించేవారని డీఎఫ్‌ఓ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తుందన్నారు.

Tags

Next Story