ములుగు జిల్లాలో నలుగురు మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాటు

ములుగు జిల్లాలో నలుగురు మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాటు
X

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు దళ సభ్యులు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి డాక్టర్ శబరీష్ లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుల వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన ‘పోరుకన్నా ఊరు మిన్న’, ‘మన ఊరికి రండి’ అవగాహన కార్యక్రమం ద్వారా, పోలీస్ శాఖ అందిస్తున్న పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని నక్సలిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో వారు లొంగిపోయినట్లు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన నలుగురు మావోయిస్టులకు సరెండర్

పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి రూ.25 వేల చొప్పున పునరావాస నిమిత్తం నగదు రివార్డు అందజేస్తామని అన్నారు. మావోయిస్టు పార్టీ బలహీన పడుతున్న నేపథ్యంలో కిందిస్థాయి క్యాడర్, పైస్థాయి నాయకత్వంపై అసంతృప్తితో రహస్య జీవితం వదిలి కుటుంబాలతో కలిసి శాంతియుత జీవితాన్ని ఎంచుకుంటున్నారని అన్నారు. మావోయిస్టులు ప్రభుత్వం అందజేసే సహాయం సమాజంలో స్థిరపడేందుకు పూర్తి మద్దతు అందిస్తుందని అన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు వనాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఒఎస్‌డి, ములుగు డిఎస్‌పి నలువాల రవీందర్, సిఆర్‌పిఎఫ్ సెకండ్ కమాండెంట్ జంగ్ షేర్, ఆర్‌ఐ తిరుపతి, వెంకటాపురం సిఐ రమేష్, ఎస్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Next Story