తెలంగాణకు మళ్ళీ అన్యాయం

తెలంగాణకు మళ్ళీ అన్యాయం
X

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో తెలంగాణ కు మరోసారి అన్యాయం జరిగిందని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన నిధులు,ప్రాజెక్టు లు,విభజన హామీల అమలు విషయంలో కేంద్రం పుష్కరకాలంగా వివక్షపూరిత వైఖరి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని, రేవంత్ రెడ్డి ఢిల్లీలోని బిజెపి పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షణలవల్ల కలిగిన ప్రయోజనం పైన తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం తనపై ఉన్న కేసులను, అవినీతి ఆరోపణల నుంచి కాపాడమని బిజెపి పెద్దల కాళ్లు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులపాటు ఢిల్లీ పర్యటనలు చేశారని ఈ బడ్జెట్ లో జరిగిన సున్నా కేటాయింపులతో తేలిపోయిందని ఆరోపించారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చ క్కర్లు కొట్టిన ఆరు చిల్లర పైసలు కూడా తేలేని చేతగాని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండ డం దౌర్భాగ్యం అని పేర్కొన్నారు.

ఇద్దరు కేంద్ర మంత్రులున్నా చిల్లిగవ్వ దక్కలేదు

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని ఈ బడ్జెట్‌పై బిజెపి నేత లు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పార్లమెంట్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన విభజన హామీల నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, కొత్త రైల్వే లైన్లకు నిధు లు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐటి, ఐఐఎం, విద్యాసంస్థల ఏర్పాటు, ఖమ్మంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి అనేక కీలక డిమాండ్లపై తాము గత పది సంవత్సరాలకు పైగా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేసినా, ఏ ఒక్కదానికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు.

ఎంపీలు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బిజెపి ఎంపీలు, కేం ద్ర మంత్రులు, రాష్ట్ర ప్ర భుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటే ప్రతి బడ్జెట్‌లో నిధుల వరద పారుతుందని, పక్క రాష్ట్రాలకు బడ్జెట్లలో జరుగుతున్న కేటాయింపులను చూసి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జాతీయ పార్టీ లు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని ఈ బడ్జెట్ మరోసారి నిరూపించిందని స్పష్టం చేశారు. తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సిఎం రేవంత్ రెడ్డి, బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బిజెపి పార్టీల ఎంపీలు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story