అశ్రునయనాలతో ప్రియాంక అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన జనం

అశ్రునయనాలతో ప్రియాంక అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన జనం
X

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు సోమవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన కనికె వెంకటేష్- చంద్రకళ దంపతులకు ప్రియాంక, బిందు, పరిమళ ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు బీటెక్ పూర్తి చేశారు. పెద్ద కుమార్తె ప్రియాంక రాజమండ్రి జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 3న రాజమండ్రిలోని ఓ షాపింగ్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు సోమవారం తనువు చాలించింది. నడిగడ్డలో విషాదఛాయలు నెలకొన్నాయి.

కావాలనే హత్య చేశారు

మద్యం మత్తులో ఉన్న యువకులు తన కుమార్తెను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టారు. పై నుంచి కారు నడిపి తన కుమార్తె మృతికి కారకులయ్యారని ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతమయ్యారు. డాక్టర్‌గా స్థిరపడి నడిగడ్డ ప్రజలకు సేవలు అందిస్తుందన్న ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందాడు. ఎంతో కష్టపడి ముగ్గురు కూతుర్లను చదివించానన్నారు. తన కుమార్తె మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

జనసంద్రంగా ఎక్లాస్‌పూర్

డాక్టర్ ప్రియాంక అంత్యక్రియల నేపథ్యంలో ఆమెను కడసారి చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు, రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎక్లాస్‌పూర్ జనసంద్రంగా మారింది. వెంకటేష్ పొలంలో ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించారు. అయిజలో నిర్వహించిన అంతిమయాత్రలో పర్యాటక సాంసృ్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

*- దోషులను శిక్షిస్తాం

ప్రియాంక మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రియాంక దుర్ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. అంత్యక్రియలో పాల్గొని రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రియాంక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

Tags

Next Story