గణేష్ నిమజ్జనంలో విషాదం... యువకుడు మృతి

సిటిబ్యూరోః గణేష్ నిమజ్జనంలో విషాదం నెలకొంది. నిమజ్జనం కోసం వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు వాహనం కిందపడడంతో శుక్రవారం మృతిచెందాడు. ఈ సంఘటన ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1167 వద్ద చోటుచేసుకుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఊరేగింపును చూసేందుకు వచ్చిన జూబ్లీహిల్స్, కార్మిక నగర్‌కు చెందిన శివ(20) వాహనం కిందపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ముందు కొంతమంది యువకులు డ్యాన్స్ చేస్తున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు
లాఠీఛార్జ్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారు భయంతో పరుగు తీశారు, సదరు యువకుడు పక్కనే ఉన్న ట్యాంకర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడడంతో వెనుక నుంచి వస్తున్న ఊరేగింపు వాహనం చక్రాల కిందపడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్నేహితులు, బంధువులు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
