ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచి రాజమౌళి మృతి

మన తెలంగాణ/గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి చెందిన కూసం రాజమౌళి(76)గుండె పోటుతో ఆదివారం మరణించారు. జాతీయ స్థాయిలో గ్రామ అభివృద్ధిలో కూసం రాజమౌళి రాజకీయ ప్రస్థానం ఆయన కృషి ఎంతో కీలకమైంది. ఆయన నాయకత్వంలో గంగదేవిపల్లి గ్రామం దేశానికే దిక్సూచిగా నిలిచింది. గంగదేవిపల్లి అంటే రాజమౌళి, రాజమౌళి అంటే గంగాదేవిపల్లి అనే స్థాయికి ఆయన తన ముద్ర వేశారు. గ్రామంలో నెలకొన్న మధ్యపానం, నిరక్షరాస్యత వంటి సమస్యలను రూపుమాపడానికి ఆయన గ్రామస్థులను ఏకం చేశారు.
1994లో మచ్చాపూర్ గ్రామం నుంచి గంగదేవిపల్లి వేరేగా ఏర్పడి 1995 నుంచి వారి భార్య కూసం లలిత రెండు సార్లు, రాజమౌళి ఒక సారి సర్పంచ్‌గా సుదీర్ఘ సేవలుఅందించారు. గంగదేవిపల్లి సాధించిన ప్రగతిని చూసి కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు వైస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ తో ప్రశంసలు అందుకున్నారు. విదేశీ ప్రతినిధులు సైతం గంగాదేవిపల్లిని సందర్శించి రాజమౌళి ప్రణాళికలను అధ్యాయనం చేశారు.
కెసిఆర్ నివాళి
వరంగల్ జిల్లా గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మరణం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధి పరిచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పల్లెల అభ్యున్నతికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి కూసం రాజమౌళి అని కొనియాడారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజమౌళి అనుభవాలను నాటి ప్రభుత్వం వినియోగించుకున్నదని తెలిపారు.
-
Home
-
Menu
