మందులోడా ఓరి మాయలోడా..... జనరిక్ మందులు వాడండి... ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోండి

వచ్చే నెలలో 850 రకాల ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఇందులో ఆంటిబయాటిక్సే కాకుండా కోట్ల మంది నిత్యం వాడే షుగర్, బిపి మాత్రల ధరలు ఓ పది శాతం పెరగొచ్చు. మన రాష్ట్రంలో ఓ 50 లక్షల మంది మధుమేహం బాధితులు ఉండొచ్చు. కేవలం 15% మాత్రమే ప్రభుత్వ మందులు వాడతారు. 85% మంది ప్రైవేటు మందులే దిక్కు.
అసలే నిత్యావసర ధరలు పెరిగాయి. గ్యాసు, పెట్రోలు, వంటనూనెలు చుక్కలు చూపిస్తుంటే పేద మధ్య తరగతికి ఇక చాలా కష్టమే. షుగర్ బిపి ఉంటే ఓ 2000 అదనంగా భరించాల్సిందే. ఇంటిలో ఇద్దరుంటే అంతే. మరి ఎలా తట్టుకోవాలి అంటే జనరిక్ దుకాణాల వైపు పోవడం నేర్చుకోవాలి అంటే ఏమిటో తెలుసుకుందాం..
1. బ్రాండెడ్ మందులు : అనగా ఒక మందు కనుగొనడానికి ట్రయల్స్ వేసేకి పరిశోధనలు చేసేకి కంపెనీలు ఖర్చు చేస్తాయి. దానిని వారే తయారు చేసుకోవాలి అని 20 ఏళ్ళు పేటెంటు తీసుకుంటారు. వారు జ్వరానికి ఓ మందు కనుగొంటే ఉదాహరణకు పారసిటమాల్ అనే సాంకేతిక నామం ఉంటే సన్నీలియోన్ అని పేరు పెట్టి మార్కెట్ లోకి వదలతారు. ఇక బ్రాండు ప్రమోషన్ చేస్తారు. అడ్వర్టయిజింగ్, భోజనాలు వాయనాలు కాన్ఫరెన్సులు పెట్టి ఓ ఊపు ఊపిస్తారు. దీని ఖర్చంతా ప్రజలే భరించాలి. అందుకే రూపాయ మందు మొదట వందరూపాయలకు అమ్ముతారు. అలా అమ్మిన తరవాత నిదానంగా తగ్గిస్తూ ఎక్కువ మందికి అమ్ముతారు.
దానిని కరిగించి మనం ఫార్ములా కనుక్కొన్న తయారు చేయరాదు శిక్షార్హులు అవుతారు. కంపెనీ వాడు చెప్పిందే పాట, ఆడిందే ఆట అవుతుంది. మనం తోలు బొమ్మలం అవుతాము.
2.జనరిక్ మందులు: ఆ పేటెంటయినాక ఎవరైనా తయారు చేసుకోవచ్చు. అప్పుడు అదే కంపెనీ బల్కుగా తయారు చేసి చాలా దేశాలకు అమ్ముతుంది దానికి ఇంత సుద్ద కలిపి జయమాలిని, జ్యోతిలక్ష్మి అని పేరుతో వంద రూపాయల టాబ్లెట్ ను 10 రూపాయలకు అమ్ముతారు.
3. బల్కు తయారి పైరేట్సు ఆఫ్ కరీబియన్ : ఈ బల్కు మందు ఇంతకు ముందు చైనా నుంచి వచ్చేవి. ఇపుడు ఇండియాలోనే 10,500 కంపెనీ లున్నాయి. తెలంగాణాలోనే 5,500 కంపెనీలు ఉన్నాయి. వీరంతా ఆ మందును బల్కుగా తయారు చేసి చిన్న చిన్న కంపెనీలకు అమ్ముతారు.
4. లోకల్ పైరేట్సు : ఇక ఆ చిన్న కంపెనీలు ఆ బల్కు మందులో సుద్దేసి బిళ్ళలు కొట్టి అమ్ముతారు. ఒకప్పుడు నరసరావుపేట చుట్టు పక్కల వందల కంపెనీలు ఉండేవి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలకు నాణ్యత లేని బిళ్ళలే అమ్మేవారు. ఇక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటాది నా స్వామి రంగా ఎంఆర్ పి ధర సన్నీ లియోన్ ది అమ్మేది జయమాలిని బ్రాండు, జ్యోతిలక్ష్మి రేట్లు ఉంటాయి. మరలా పది బాక్సులకు పది ఫ్రీ అంటే పది పైసలది రూపాయకమ్మితే లాభము 90 పైసలు అవుతుంది. అదే వందకమ్మితే ఎంత లాభమో ఏమన్నా ఉందా? ఈ అక్రమ సంపాదనతోనే ప్రభుత్వాలనే శాసిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ తోక పీకుడు గాళ్ళ నేమి చేయలేక జనఔషధి అనే మెడికల్ షాపుల చైన్ లు స్ధాపించింది
అందరు సామాన్యులకు అందుబాటు ధరలో జనరిక్ మందులు అనే నినాదంతో మాననీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టారు. నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, 2014 లో మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)ని ఫార్మాస్యూటికల్స్ శాఖ, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, నవంబర్, లో భారత ప్రభుత్వం మరలా ప్రారంభించింది. ఈ పథకం కింద, ప్రజలకు అంకితం చేయబడింది. జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందించడానికి జనౌషధి కేంద్రాలుగా పిలువబడే ఫార్మసీ అవుట్‌లెట్‌లు తెరవబడ్డాయి. 06.08.2021 నాటికి, దేశవ్యాప్తంగా 8012 జనౌషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. పిఎం బిజెపి ఉత్పత్తి బాస్కెట్‌లో 1451 మందులు, 240 శస్త్రచికిత్స ఉత్పత్తులు ఉన్నాయి. ఫార్మా & మెడికల్ బ్యూరో ఆఫ్ ఇండియా, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడిన సొసైటీ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది.
1. జనాభాలోని అన్ని వర్గాల ప్రత్యేకించి పేదలు, అణగారిన వారికి నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోండి.
2. నాణ్యత అనేది అధిక ధరకు మాత్రమే పర్యాయపదం అనే భావనను ఎదుర్కోవడానికి విద్య, ప్రచారం ద్వారా జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించండి.
3. పిఎంబిజెపి కేంద్రాన్ని ప్రారంభించడంలో వ్యక్తిగత వ్యవస్థాపకులను నిమగ్నం చేయడం ద్వారా ఉపాధిని సృష్టించడం.
మీ ప్రాంతాలలో ఈ దుకాణాలను నెట్ లో సర్చు చేసి గుర్తించండి. అక్కడ మందులు అతి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందు కొనండి. ఎంత ఎక్కువ ధర ఉంటే అంత గొప్ప అనే దృక్పధం మార్చుకోండి. జనరిక్ మందులలో ఉండే బల్కు మందు బ్రాండెడ్ లో ఉండేదీ ఒకటే. పేర్లే వేరు. సన్నీలియోనన్నా, జయమాలిని అన్నా, జ్యోతిలక్ష్మి అయినా వేసే డాన్సు చేసే మాజిక్ ఒకటే. అదే పారసిటమాల్ జనరిక్ మందు డోలో బ్రాండెడ్ మందు చేసే పని ఒకటే. నేను 10 సంవత్సరాలనుంచి బిపి కి ఆమ్లోడెపిన్ అనే జనరిక్ మందే వాడతాను. బాగా కంట్రోలు లోనే ఉంది. జనరిక్ మందులు వాడండి. ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోండి. ఇక ఆలస్యమెందుకు పదండి. జనఔషధి రిజిష్టర్డు షాపులో జనరిక్ మందులను కొనండి.
డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ (సిటివిఎస్)
గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
Tags
-
Home
-
Menu
