ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఖైదీ ఆత్మహత్యాయత్నం

చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన ఖైదీ.. వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం నిజామాబాద్‌లో కలకలం రేపింది. తీవ్ర గాయాలైనప్పటికీ ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద పోలీసుస్ట్టేషన్ పరిధిలో 2024లో నమోదైన పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ కేసులో లకావత్ రాజుపై కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో పోలీసులు ఈ నెల 18న సాయంత్రం అతడిని అరెస్ట్ చేసి నిజామాబాద్ కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం ఉదయం రాజు లేవకపోవడంతో జైలు సిబ్బంది గమనించారు. జైలర్లు, సిబ్బంది పలుమార్లు మాట్లాడించే ప్రయత్నం చేశారు.
స్పందన లేకపోవడంతో జవాన్లు, డ్రైవర్, మెడికల్ ఎంఎన్‌ఓలను పిలిపించి అంబులెన్‌సలో ఉదయం 7 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు అందించడంతో పాటు సిటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. రాజుకు మద్యం అలవాటు ఉండటంతో సైకియాట్రిస్ట్ సలహా కూడా అవసరమని వైద్యులు సూచించినట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం రాజును ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పరుగెత్తి భవనం నుంచి కిందకు దూకాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కిందకు చేరుకుని అతడిని స్ట్రెచర్‌పై ఉంచి తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. రాజును పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.
-
Home
-
Menu
