కమీషన్‌లు ఇస్తే కాంట్రాక్టు!

MRI Scan
X
  • టిజిఎంఎస్‌ఐడిసిలో అంతులేని అక్రమాలు
  • నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసి కోట్లు దండుకున్న అధికారులు
  • ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు

మనతెలంగాణ/హైదరాబాద్: టిజిఎంఎస్‌ఐడిసి (తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో జరుగుతున్న అవినీతి కుంభకోణంపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఈడీ స్థాయి (ఎగ్జిక్యూటివ్ అధికారి) నాలుగేళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ కోట్లలో దోచుకుంటున్నారని సిఎంఓకు ఫిర్యాదులు అందాయి. గతంలో జరిగిన టెండర్‌ల దగ్గరి నుంచి ప్రస్తుతం బిల్లుల చెల్లింపుల వరకు కమీషన్‌ల దందా ఈ సంస్థలో భారీగా జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలో పనిచేసే ఈడీని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని సిఎంఓ నుంచి ఆదేశాలు అందినా, సంవత్సరకాలంగా ఈడీ ఈ సంస్థ నుంచి వెళ్లకుండా ఆయన అంతులేని అక్రమాలకు తెరతీశారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. గత సంవత్సరం 25 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫర్నీచర్ కొనుగోళ్లు, ఎంఆర్‌ఐ (11 మిషన్‌లకు) టెండర్‌లకు సంబంధించి గోల్‌మాల్ జరిగిందని, కమీషన్‌లు ఇచ్చే కంపెనీలకే టెండర్‌లు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలపై ‘మనతెలంగాణ దినపత్రిక’లో 24, అక్టోబర్ 2024న, ఏప్రిల్ 04వ తేదీ 2025 ఈ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ సమయంలో కొన్నిరోజుల పాటు టెండర్‌లు, ఒప్పందాలను, చెల్లింపులను పక్కన బెట్టిన ఈ సంస్థ అధికారులు తదనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్‌ఐ మిషన్‌లు, ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్‌లను అర్హత లేని కంపెనీలకు కట్టబెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఆయా సంస్థలకు చెల్లింపులు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

నాసిరకం ఫర్నీచర్ కొనుగోళ్లపై..

ప్రస్తుతం 25 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫర్నీచర్ కొనుగోళ్లకు సంబంధించి టెండర్‌లు దక్కించుకున్న మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ నాసిరకం ఫర్నీచర్‌ను సరఫరా చేయడం ప్ర స్తుతం ఈ అంశం వివాదాస్పదం అయ్యింది. దీంతోపాటు ఈ సంస్థకు ఒకేసారి రూ.15 కోట్ల చెల్లింపుల పై కూడా ప్రభుత్వాని కి ఫిర్యాదు అందినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఎంఆర్‌ఐ (11 మిషన్‌లకు) సంబంధించి టెం డర్‌లలోనూ గోల్‌మాల్ జరిగినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ప్ర స్తుతం నాలుగేళ్లుగా ఇక్క డ పనిచేస్తున్న ఒక ఈడీ అధికారి టెం డర్‌ల వ్యవహారం నుంచి ప్రతి పనిలోనూ కమీషన్ ఆశిస్తారన్న ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఆయన కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని ఈ అవినీతి బాగోతానికి ఈడీ స్థాయి అధికారి తెరతీసినట్టుగా సమాచారం.

మొత్తం 11 ఎంఆర్‌ఐ మిషన్‌ల..

మొత్తం 11 ఎంఆర్‌ఐ మిషన్‌లను కొనుగోళ్లు చేయడానికి టిజిఎంఎస్‌ఐడిసి అధికారులు టెండర్‌లను పిలవాల్సి ఉంది. అయితే, కమీషన్‌ల కోసం ఈ టెండర్‌లలో సింగిల్ కంపెనీ మాత్రమే పాల్గొనేలా ఆ కంపెనీకి మాత్రమే ఈ టెండర్‌లు దక్కేలా ఈ సంస్థ అధికారులు చక్రం తిప్పినట్టుగా తెలిసింది. ఈ ఎంఆర్‌ఐ మిషన్‌లలో 3 టెస్లా మోడల్‌కు చెందిన 5 ఎంఆర్‌ఐ మిషన్‌ల కోసం (వాటి ధర ఒక్కో మిషన్ రూ.25 కోట్లు), కాగా, 60 బోర్ మోడల్ ఎంఆర్‌ఐ మిషన్‌లు నాలుగింటి కోసం (రూ.14 కోట్లు, ఒక్కో మిషన్), 70 బోర్ మోడల్ ఎంఆర్‌ఐ మిషన్‌లు రెండింటి కోసం (రూ.ఒక్కో మిషన్ రూ.18 కోట్లు)గా ఉంటుంది. ఇలా, పెద్దమొత్తంలో ఆయా కంపెనీలకు మేలు చేసి కోట్ల రూపాయలను ఈ సంస్థకు చెందిన అధికారులు దండుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్లకు..

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్ల టెండర్‌లకు సంబంధించి ఈ సంస్థ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సెంట్రల్ స్పాన్షర్ స్కీంలకు సంబంధించి 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులపై కన్నేసిన ఈ సంస్థ అధికారులు మార్చి 31వ తేదీతో ఈ నిధులను వినియోగించుకోకపోతే నిధులు రిటర్న్ వెళ్లిపోతాయని ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి టెండర్‌లు లేకుండానే పాత వారికే ఈ కాంట్రాక్టు కట్టబెట్టడానికి ఫైల్ మూవ్ చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ స్పాన్షర్ స్కీంలోనే సుమారుగా రూ.30 కోట్లను కమీషన్‌లు చేతులు మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం. టిజిఎంఎస్‌ఐడిసిలో పనిచేసే ఈడీ స్థాయి అధికారిని అక్కడి నుంచి తప్పించకపోతే కోట్లలో ఈ సంస్థకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలిసింది.

Tags

Next Story