ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం..

ఇండియన్ బ్యాంకులో బంగారం మాయం..
X

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం చూపడంతో అవసరాల నిమిత్తం ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. బ్యాంకు అధికారుల నెలవారి తనిఖీ సందర్భంగా బంగారం కనిపించకపోవడంతో బ్యాంకులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం బయటకు పొక్కడంతో తాకట్టుదారులు ఆందోళన బాట పట్టారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ల కథనం ప్రకారం.. ఆర్థిక అవసరాల నిమిత్తం ప్రజలు బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. తాకట్టు పెట్టిన 22 మందికి చెందిన సుమారు రూ.కోటి విలువైన 810 గ్రాముల బంగారం కనిపించలేదు.

అసిస్టెంట్ మేనేజర్ గోవిందం కూడా కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులు తనిఖీ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ గోవిందం చేతివాటం చూపించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయం బ్యాంకు అధికారులకు నెలవారి ఆడిట్‌లో స్పష్టమైంది తనిఖీ సందర్భంగా 22 మందికి సంబంధించిన బంగారం మాయం కావడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పరారీలో ఉండడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 22 మందికి సంబంధించిన బంగారంలో 16 మందికి చెందిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టి రూ.96 లక్షలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మిగతా ఆరుగురుకి చెందిన బంగారాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అందులో భాగంగా అతడి ఇంటిపై దాడి చేశారు. ఆరుగురికి చెందిన కొంత బంగారం అతడి వాహనం డిక్కీలో లభించినట్లు తెలిసింది.

Tags

Next Story