గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని గొల్లల గుడిని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ప్రకటన జారీ చేసింది. భారత పురావస్తు శాఖ అధ్యయన విభాగం 2026 ఆగస్టు 31న గెజిట్ ఆఫ్ ఇండియా ఏఎస్‌ఐ జారీ చేసింది. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాకతీయ రుద్రేశ్వర(రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ గొల్లల గుడి ఉంది. ఇది తూర్పు ముఖంగా ఉన్న మండపం.. దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన త్రికూటాలయం. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, సునిశిత రంధ్రాల వల పనితనంతో
ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది. ఈ ప్రధాన గుడికి ముందువైపు రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉన్నాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగంలో మండపం గుండా మధ్యలో ఉన్న ప్రధాన మందిరానికి మార్గం ఉంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.
-
Home
-
Menu
