కొమురం భీం ఆశయాలతో యువత ముందుకు సాగాలి: గవర్నర్

కొమురం భీం త్యాగం దేశానికి స్ఫూర్తి అని,వారి ఆశయాలతో యువత ముందుకు సాగాలనీ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పిలుపు నిచ్చారు శుక్రవారం జిల్లా లోని రౌట సంకెపల్లి గ్రామంలో నిర్వహించిన కొమురం భీమ్ జల్, జంగల్, జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం-2026 కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడారు రౌట సంకెపల్లి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని, ఆదివాసీ సమాజ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలమని పేర్కొన్నారు. అమర వీరుడు కొమురం భీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదం కేవలం మూడు పదాలు కాదని, ప్రకృతి-మనిషి సహజీవనానికి ప్రతీక అని అన్నారు. ప్రకృతిని కాపాడే సమాజాన్ని ప్రకృతి కూడా కాపాడుతుందని పేర్కొన్నారు.
ఆదివాసి హక్కులు, ఆత్మగౌరవం కోసం గొప్ప సైన్యం లేకపోయినా ధైర్యసాహసాలతో పోరాడారని, ఆయన త్యాగం దేశ ఆత్మగౌరవానికి చిరస్మరణీయంగా నిలిచిందన్నారు.ఆదివాసీ మహానేతల ఆలోచనలు, ఆదర్శాలను యువతకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, సంప్రదాయ విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు.మహిళల సాధికారత లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి, విద్య, గౌరవం, స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.దేశం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నప్పటికీ యువత తమ మూలాలను, సంస్కృతిని మరవకూడదని గవర్నర్ సూచించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమాజ సేవ భావన ద్వారానే విజయాన్ని సాధించవచ్చన్నారు.ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తున్నప్పటికీ, సమాజ భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
రౌటా సంకెపల్లి గ్రామం భవిష్యత్తులో ఆదర్శ ఆదివాసీ అభివృద్ధి, సామాజిక చైతన్యానికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రామోత్సవం నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులను, సామాజిక సేవకులను అభినందించారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, సంస్కృతిని కాపాడుతూ, సమానాభివృద్ధి కలిగిన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ముందుగా మాజీ గవర్బర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ..ఆత్మ గౌరవ పోరాటానికి పునాది వేసిన పోరాట యోధుడు కొమురం భీం అని పేర్కొన్నారు.వారి స్పూర్తి తో నిర్వహిస్తున్న ఈ కార్యమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రావడం సంతోషకరంగా ఉందన్నారు. భీం జల్ జంగల్ జమీన్ అనే నినాదం తో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసంనిజాం నిరంకుశ పాలన పై పోరాటం చేశారన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ గిరిజన కుటుంబాలకు సౌర విద్యుత్తు పలకాలను పంపిణీ చేశారు.
అంతకుముందు గవర్నర్ కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురం భీం కాంస్య విగ్రహా ప్రతిష్టాపనకు శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్,ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కాటేపల్లి వెంకటరమణ, వెడ్మ బొజ్జు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్, నిర్వాహకులు రాయపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
