అకాల వర్షానికి తడిసిన ధాన్యం

ఎల్నినో పరిస్థితులను తట్టుకొని ఎంతో శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి నీటిపాలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, పుల్కల్, హతనూర్, చౌటకూర్ తదితర ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి. కొన్నిచోట్ల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొనుగోలుపై మీనమేషాలు వేయడంతో కొనుగోలు కేంద్రాల వద్ద తమ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే పౌరసరఫరాల శాఖ విధించిన కండిషన్లతో ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. దీంతో అగ్రిమెంట్లు సకాలంలో జరగకపోవడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా యాతనలు పడుతున్నారు.
ఐకేపీ కేంద్రాల వద్ద కూడా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. 101 కొనుగోలు కేంద్రాలను తెరిచినప్పటికీ 59చోట్ల మాత్రమే కొద్దిపాటి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 1,549 మంది రైతుల నుంచి 81,500 క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా టన్నుల కొద్దీ ధాన్యం రైతుల వద్దే ఉన్నది. రైతులు ధాన్యాన్ని తగిన విధంగా ఆరబోసిన తర్వాత కూడా తూకం వేసే పరిస్థితి లేదు. అందువల్ల ఎక్కడి ధాన్యం అక్కడే కుప్పలు కుప్పలు ఉన్నది. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను వేడుకుంటున్నారు. ఈ సమయంలోనే అకాల వర్షం కురవడంతో అనేకచోట్ల ధాన్యం తడిసి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
మిల్లర్ల సమస్య కొలిక్కొచ్చేదెన్నడో!?
జిల్లాలో పౌరసరఫరాల శాఖ వైఫల్యం కనిపిస్తోందని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అనేకసార్లు జిల్లా యంత్రాంగం మిల్లర్లతో సమావేశాలు నిర్వహించినప్పటికీ ధాన్యం కొనుగోళ్లకు వారు అంగీకరించలేదు. ఇప్పుడు కూడా మిల్లర్లను ఒప్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ వారు ససేమిరా అంటున్నారు. ఈ సమస్య ఎప్పుడు కొలిక్కి వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ఊపందుకుంటాయో తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల పుల్కల్ మండలంలో రైతులు ధర్నా చేసి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు వచ్చి నచ్చజెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. ఈ కారణంగా మండలంలోని పోచారం గ్రామంలో ఆరబోసి వందల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని, ఈ ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు కొనుగోలు చేస్తారని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ సమన్వయ లోపంపై ఆగ్రహం
ఒకపక్క ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. మరోపక్క పండించిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామే తప్ప ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సిద్ధం కావడం లేదని వారు మండిపడుతున్నారు. పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం కారణంగానే ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. సమన్వయ లోపమే శాపంగా మారిందని మండిపడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా తమకే నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
-
Home
-
Menu
