కౌటాలలో తుపాకీ కలకలం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలో మంగళవారం తుపాకీ కలకలం సృష్టించింది. కౌటి=సాండ్‌గాం గ్రామానికి చెందిన ఓ యువకుడు డబ్బుల కోసం ఓ ఫెర్టిలైజర్ యజమాని తమ్ముడిని బెదిరించి తుపాకీతో కాల్పులకు పాల్పడినట్లు జిల్లా ఎస్‌పి నిఖిత పంత్ తెలిపారు. మంగళవారం కౌటాల సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబందించి వివరాలను ఆయన వెల్లడించారు. కౌటి=సాండ్‌గాం గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో జూన్ 12న రూ.50 లక్షలు తీసుకొని మహారాష్ట్రలోని చంద్రాపూర్ బస్టాండ్‌కు రావాలని, లేనిపక్షంలో చంపేస్తానని ఓ ఫెర్టిలైజర్ షాపు షట్టర్‌కు బోర్డు అంటించాడు. అయినా బాధితుడు స్పందించకపోవడంతో యూట్యూబ్‌లో తుపాకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని జులైలో బీహార్ వెళ్ల్లి రూ.55 వేలు చెల్లించి 1 పిస్తోలు, 2 మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు, 1 తపంచాను తీసుకొచ్చాడు. అక్టోబర్ 10న బాధితుడి తమ్ముడు
ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆ యువకుడు మార్గమధ్యలో ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆగకుండా వెళ్లడంతో బుల్లెట్ ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్ విచారణ జరిపారు. ఈ క్రమంలో మంగళవారం ఫెర్టిలైజర్ యజమాని లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా షాపునకు వస్తారని గ్రహించి వారిని తుపాకీతో కాల్చి చంపాలనే ఉద్దేశంతో పిస్తోలు, 3 బుల్లెట్లు తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. అయితే, స్థానిక ఎన్నికల సందర్భంగా మార్గమధ్యలో పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఆ యువకుడు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసును ఛేదించిన కాగజ్‌నగర్ డిఎస్‌పి వహీదుద్దిన్, కౌటాల సిఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్, పోలీసు సబ్బందిని ఎస్‌పి నిఖిత పంత్ అభినందించారు.
-
Home
-
Menu
