ఎసిబి వలలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్

అవినీతి నిరోధక శాఖ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కార్యాలయంలో వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హనమకొండ డిఇఓ బదిలీపై వెళ్లడంతో ఇన్చార్జి డిఇఒగా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఒక ఫైల్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు.
వరంగల్ రేంజ్ ఎసిబి డిఎస్‌పి సాంబయ్య ఆధ్వర్యంలో పకడ్బందీగా వల పన్ని శుక్రవారం అదనపు కలెక్టర్, హనుమకొండ ఇన్చార్జి డిఈఓ అయిన వెంకట్‌రెడ్డిని పట్టుకున్నారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్‌లోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే ఎసిబి అధికారులు అదనపు కలెక్టర్‌తో పాటు మరో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని కలెక్టర్ కార్యాలయంలోనే విచారిస్తున్నట్లు తెలిసింది . పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపారు. ఇదిలావుండగా, హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరించినప్పటి నుంచి ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అనేక వివాదాస్పద స్థలాలను ముడుపులు తీసుకొని క్లియర్ చేసినట్లు తెలిసింది.
-
Home
-
Menu
