వాళ్లలాగా నేను కబ్జాలు పెట్టలేదు: హరీష్ రావు

సిద్దిపేట: అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పానని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. సర్వే నెంబర్లతో సహా భూముల వివరాలు ఇచ్చానని, కాంగ్రెస్ వాళ్లు సిద్దిపేటకు వస్తున్నారని, తన భూములు చూసి పోతారని, వందల మంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు. రోప్ పార్టీలు ఎందుకు, డ్రోన్లు పెట్టీ ఫోటోలు తీయడం ఎందుకు అని ప్రశ్నించారు. సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తాను ఇక్కడే ఉన్న తనకు చెబితే అన్ని ఏర్పాటు చేస్తానని, మంచిగా కడుపు నిండ అన్నం తినిపించి దగ్గరుండి కంటి నిండా తోట అన్నీ చూపిస్తానన్నారు. కాకుంటే ఉన్నది ఉన్నట్లు చెప్పండని, అబద్ధాలు చెప్పకండని తన జీవితం తెరిచిన పుస్తకం అని తెలియజేశారు. రామంచలలో 13 ఎకరాలు ఉంటే లేని పోనీవి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దాచింది ఏముంది కాంగ్రెసోళ్లు కొత్తగా బయట పెట్టేది ఏముందని అడిగారు. కాంగ్రెస్ నాయకులు లాగా తాను కబ్జాలు పెట్టలేదని, ప్రజల సొమ్ము దోచుకోలేదన్నారు. సిద్దిపేట ప్రజలు తన పని చూసి ఏడు సార్లు గెలిపించారని, తనని దీవించారని, కాంగ్రెస్ వాళ్లు అంత భయపడాల్సిన అవసరం లేదని, మా సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయతకు, ఆతిథ్యానికి చిరునామా అని ప్రశంసించారు. సిద్దిపేటకు ఎవరు వచ్చినా కడుపునిండా అన్నం పెడతాం, ప్రేమగా మాట్లాడుతానని హరీష్ రావు పేర్కొన్నారు. అంత మంది పోలీసులు పెట్టుకొని భయపడుకుంటూ రావాల్సిన అవసరం కాంగ్రెస్ వాళ్లకు లేదన్నారు.
Tags
-
Home
-
Menu
