రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమాగం

రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమాగం
X

మన తెలంగాణ/గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఆగమాగం అవుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పట్ట ణ కేంద్రంలోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో హరీశ్ రావు మాట్లాడారు. రెండున్నరేళ కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో ప్రజలకు అర్థమైందని అన్నా రు. ఎవరిని అడిగినా రేవంత్ పాలన ఎలా ఉందో చెబుతారని అన్నారు. గజ్వేల్‌లో జానెడు సీసీ రోడ్లు కూడా వేయలేదని, మోరీ కూడా కట్టలేదని, రూపాయి పని కూడా జరగలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మహాలక్ష్మిఅంటాడని, పింఛన్లు పెం చుతానని మాటఇచ్చి తప్పాడని ఆరోపించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించడానికి రేవంత్‌రెడ్డి కట్టలు కట్టలుగా డబ్బులు పంపించారని, ఆ డబ్బులు మనల్ని కొట్టి సంపాదించినవేనని అన్నారు. ఎవరు ఎంత ఇచ్చినా అవి మన పైసలేనని, వాటిని తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

బిఆర్‌ఎస్ పాలనలో ఎస్సీలకు, గౌడలకు, యాదవులకు, క్రిస్టియన్లకు, వైశ్యులకు అందరికీ ఆత్మగౌరవ భవనాలు కట్టామని చెప్పారు. మిషన్ కాకతీయపై పెట్టిన ఖర్చే రూ.5వేల కోట్లు అయితే, బీజేపీ ఎంపీలు మాత్రం రూ.5,0-60 కోట్లు కేసీఆర్ తిన్నారని ఆరోపించారని అన్నారు. బీజేపీ వాళ్లు బట్ట కాల్చి మీద వేసి రకం అని విమర్శించారు. కాళేశ్వరం కట్టాకే బంగారు పంటలు పండుతున్నాయని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కాళేశ్వరం నిర్మించిన తర్వాత భూముల ధరలు పెరిగాయని, భూమికి బరువయ్యే పంట పండిందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి వెళ్లాయని అన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు ఏడాది గడిచినా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గొర్రెల పంపిణీ, కంటి వెలుగు వంటి పథకాలను నిలిపేశారని ఆరోపించారు. రైతులకు ఎరువులు లేవని, పంట పెట్టుబడి సాయం లేదని అన్నారు. బీజేపీ వాళ్లు ఏం చేశారని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఒక్క పని చేయకుండా ఎలా ఓట్లు అడుగుతారని, కమలం గుర్తుకు ఓటు వేయడం అంటే మోరీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెలీ వంటిరు యాదవ రెడ్డి, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జ్ ‘ రాధాకృష్ణ శర్మ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story