కోర్టు తేల్చకముందే ఇల్లీగల్ అని ఎలా అంటారు..?: హరీష్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చీఫ్ విసి సజ్జనార్ తీరుపై బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే ఫోన్ ట్యాపింగ్‌ను ఇల్లీగల్ అని అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ఈ మేరకు ఆదివారం మాజీ సిఎం కెసిఆర్ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా హరీష్ రావు ట్వీట్ చేశారు. సిట్ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టబద్ధంగా నిలవదని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఒక ఆరోపణ నేరమని తేల్చాల్సింది న్యాయస్థానం మాత్రమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, నిందితుడు నిరపరాధి అనే భావన ప్రాథమిక సూత్రం అని, దీనిని విస్మరించరాదని అన్నారు. దర్యాప్తు చేయడం మాత్రమే పోలీసుల విధి అని, విచారణ దశలోనే ఒక చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి వారేమీ న్యాయమూర్తులు కాదని పేర్కొన్నారు.
ఒక ఫోన్ సంభాషణను రహస్యంగా వినడం చట్టబద్ధమా..కాదా..? అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటుందని వివరించారు.అలాగే, పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందా..లేదా...? అన్నది న్యాయ సమీక్ష ద్వారానే తేలుతుందని, పోలీసుల అధికారిక సందేశాల ద్వారా కాదని అన్నారు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్(అక్రమ ఫోన్ ట్యాపింగ్) అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ద్వారా, సిట్ చీఫ్ దర్యాప్తు ఫలితంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఆయన ప్రవర్తన తను నిర్వహిస్తున్న పదవికి తగదని, సీనియర్ అధికారులు పాటించాల్సిన నిష్పాక్షికత, సమగ్రతకు సంబంధించిన అఖిల భారత సర్వీసుల (ప్రవర్తనా) నిబంధనలు, 1968కు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అత్యంత రాజకీయ ప్రాధాన్యమున్న కేసులో ఇలాంటి తొందరపాటు నిర్ధారణలు చేయడం వల్ల దర్యాప్తు రాజకీయ ప్రేరేపితంగా, పక్షపాతంతో సాగుతోందనే అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడమే కాదు, అలా జరిగినట్లు ప్రజలకు కనిపించాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లడానికి పోలీసుల అధికారిక ప్రకటనలను వాడుకోరాదని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు చట్టపరిధిలో స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. తీర్పులు ఇవ్వాల్సింది కోర్టులే తప్ప పోలీసుల సందేశాలు కాదని, రాజ్యాంగ పరిమితులను సంస్థలు అతిక్రమిస్తే ప్రజాస్వామ్యం మనలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా,కెసిఆర్‌ను గౌరవ ప్రతిపక్ష నేతగా సిట్ చీఫ్ ఎందుకు గుర్తించడం లేదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.
-
Home
-
Menu
