కెసిఆర్ తెలంగాణ సాధించకుంటే.. కాంగ్రెసోళ్లకు పదవులెక్కడివి?:హరీశ్‌రావు

కెసిఆర్ తెలంగాణ సాధించకుంటే.. కాంగ్రెసోళ్లకు పదవులెక్కడివి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. పార్టీ శనివారం చేపట్టిన దీక్ష దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ లేకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. కెసిఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్లు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. నవంబర్ 29 తోనే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో ఆయన ఆరోగ్యానికి హాని ఉందని డాక్టర్లు చెప్పినప్పటికీ కెసిఆర్ దీక్ష విరమించలేదన్నారు. తన ప్రాణాన్ని సైతం లెక్కించకుండా కెసిఆర్ తెలంగాణ సాధిస్తే కొంతమంది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమాన్ని చూసి భయపడి కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా మార్చిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు.
కృష్ణానది జలాల పంపకంపై ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు, ఇంజనీర్లు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా వాదనలు వినిపిస్తున్నా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. రాజకీయం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తప్ప, నీళ్ల నిధుల కోసం కాదని ఆంధ్రులు వాదనలు వినిపించడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి తమ వాదనలు గట్టిగా వినిపించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ తెలంగాణ సాధించి నీళ్ల కోసం ట్రిబ్యునల్ తెస్తే రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఆ హక్కు తెచ్చుకునే తెలివి లేదన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదు కాబట్టి ఉద్యమకారుల విలువలు ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి కోదండరాం దగ్గరయ్యారని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి భూములను అమ్ముకునేందుకు ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కెసిఆర్ చరిత్ర నిలిచిపోతుందన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆత్మకథ పుస్తకంలో ఒక పేజీ మొత్తం కెసిఆర్ గొప్పతనం గురించి చాలా చక్కగా రాశారాని గుర్తు చేశారు.
పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, అమరుల స్థూపానికి పూలమాలసి నివాళులర్పించారు. అనంతరం దివంగత కవి అందెశ్రీ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించి మౌనం పాటించారు. ఈ సందర్బంగా ఉద్యమకారులను హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, కడవెరుగు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, పాల సాయిరాం, పూజల వెంకటేశ్వరరావు, బూర విజయ మల్లేశం,మారేడ్డి రవీందర్ రెడ్డి, ముత్యాల కనకయ్య,జంగిటి కనకరాజు, ఎడ్ల అరవింద్ రెడ్డి, మల్లికార్జున్, మెరుగు మహేష్, నందాదేవి, బాబు జానీ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
