వడ్ల కొనుగోలుపై సిఎం ఒక్కసారైనా సమీక్ష చేశారా?: హరీశ్‌రావు

వడ్ల కొనుగోలుపై సిఎం ఒక్కసారైనా సమీక్ష చేశారా?: హరీశ్‌రావు
X

వడ్ల కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులతో ఒక్కసారైనా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పరిధిలోని మెట్టుబండల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ జరగకపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం గ్రేడింగ్ పేరుతో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేసిందని, ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో 70 కోనుగోలు కేంద్రాలను మూసి వేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్న దొడ్డు వడ్లు కనీసం లక్ష మెట్రిక్ టన్నులు కూడా దాటలేదని తెలిపారు. అదే గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని గుర్తుచేశారు.

గతంలో బీఆర్‌ఎస్ పాలనలో కల్లాలకు రాగానే వెంట వెంటనే కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో దొడ్డు వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ రూ. 2100 కే అమ్ముకుంటున్నామని, అందులోనూ బస్తాకు 2 కిలోల తరుగు తీస్తున్నారని వాపోయారు. ఒకవేళ వెంటనే డబ్బులు ఇవ్వాలంటే 1శాతం కోతలు కూడా విధిదంచడంతో రైతు చేతికి రూ. 2,000 కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో క్వింటాల్‌కు రూ. 461 చొప్పున, ఎకరానికి రూ. 14 వేల నుంచి రూ. 15 వేల వరకు ప్రతి రైతుకు నష్టం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని, ఆలస్యం చేస్తే రైతులు విసిగిపోయి బయట అమ్ముకుంటారని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై తక్షణమే సర్కార్ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వానాకాలంలో ఈ సమయానికి ఎన్ని వడ్లు కొన్నారు, ఈ వానాకాలంలో ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో లెక్కలు బయటపెడితే ప్రజలకు అసలు నిజం తెలుస్తుందని అన్నారు.

ఇప్పటి వరకు సన్న వడ్ల బోనస్‌పై స్పష్టత లేదని, అసలు ఈ వానాకాలం సన్న వడ్లకు బోనస్ ఇస్తారా, ఇవ్వరా అని ప్రశ్నించారు. రైతులను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి సన్న వడ్ల బోనస్‌పై తక్షణమే జీవో విడుదల చేసి కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఇప్పటికైనా సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి, తుఫాన్ రాకముందే కల్లాల్లో ఉన్న దొడ్డు వడ్లు, సన్న వడ్లన్నింటినీ యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, కూర మాణిక్య రెడ్డి, శ్రీనివాస్, ఉమేష్, కనకయ్య తదితరులున్నారు.

Tags

Next Story