రేవంత్‌రెడ్డి హార్వర్డ్‌లో చదువుకున్నా..తన వెనకటి గుణం మార్చుకోలేదు: హరీష్‌రావు

Harish Rao comments congress
X

Harish Rao comments congress

హార్వర్డ్‌లో చదువుకున్నా సిఎం రేవంత్‌రెడ్డి గుణం మార్చుకోలేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. రవి నారాయణరెడ్డి పురస్కార ప్రదాన కార్యక్రమంలో కెసిఆర్‌పై సిఎం చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా వెళ్లి హార్వర్డ్‌లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని అన్నారు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించారు.

ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కెసిఆర్ జాతి పితనే అని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న రేవంత్‌రెడ్డికి కెసిఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది..? అని ప్రశ్నించారు. ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన ఆయనకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా..? అని నిలదీశారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా..అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న ఆయన అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా...లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన ఆయనకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి...ఎలా అర్థం అవుతాయి..? అంటూ ప్రశ్నలు సంధించారు. రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్ళినా ఆయన బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టం అని హరీష్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story