రేవంత్ జైలుకెళ్లడం ఖాయం

రేవంత్ జైలుకెళ్లడం ఖాయం
X

మన తెలంగాణ/మెదక్ జిల్లా ప్రతినిధి: హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజులో భాగంగా జిల్లాలో ని రామాయంపేట, నర్సాపూర్, మెదక్ మున్సిపాలిటీలలో భారీ ర్యాలీలతో స్ట్రీట్ కార్నర్ స మావేశంలో హాజరయ్యారు. మెదక్ జిల్లా కేం ద్రంలో స్థానిక ఐబీ నుంచి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీగా వచ్చి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర యేళ్లు అయినప్పటికీ ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదని ఆరోపించారు. ప్రజలను, రైతులను, మహిళలను మభ్యపెట్టేందుకు కళ్లబొల్లి మాటలు చెప్పి అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టుకావాలన్నారు. జిల్లాకు వచ్చి ఎంతో పవిత్రమైన వనదుర్గమాత మీద ఒట్టేసి అభివృద్ధి చేస్తానని చెప్పి మొహం చాటేసిన రేవంత్‌ను అమ్మవారు క్షమించదన్నారు. అభివృద్ధ్ది అంటే కేవలం తమ పాలనలోనే జరిగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వర్గానికి చెందినవారు కూడా సంతృప్తిగా లేరన్నారు.

మహిళలను మహాలక్ష్మి పేరుతో, రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసి తెలంగాణ ప్రజల బ్రతుకులు ఆగం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనన్నారు. మాట్లాడితే బూతులు తప్ప రాష్ట్రానికి చేసిన మేలేమి లేదన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి జైలుకు పోవడం ఖాయమని అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసి సాక్షాలను కాల్చారని ఆరోపించారు. ఈ కుట్ర పోలీసుల సహకారంతోనే చేసిందని ఆయన అన్నారు. అన్నదాతలకు సకాలంలో ఎరువులు అందించక కరువు చూపించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టడంతోపాటు కళ్యాణలక్ష్మి, తులం బంగారం ఎగవేశాడన్నారు. రైతులకు ఇవ్వాల్సిన కరెంట్ కనీసం 12 గంటలు కూడా అందించలేక ఆటో డ్రైవర్లకు యేడాదికి 12వేలు ఇస్తానని మొండిచేయి చూపించారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి మున్సిపల్ పోరులో అగ్రవర్ణాలకు చోటిచ్చి అన్యాయం చేశారన్నారు.

కానీ తాము మాత్రం మెదక్ మున్సిపాలిటీలో వందశాతం బీసీలకు టికెట్‌లు కేటాయించి వారి మనోభావాలకు గౌరవం కల్పించారన్నారు. ముఖ్యంగా మెదక్‌లో కాంగ్రెసొల్ల బెదిరింపులు ఎక్కువయ్యాయని, బెదిరిస్తే భయపడే కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో లేరని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోకపోతే బిల్లులు రావని బెదిరిస్తున్నారని మెదక్‌లో చిల్లర బెదిరింపులకు భయపడేది లేదని బిల్లులు మీ జేబునుంచి ఇస్తున్నారా? మీ జాగిరా అంటూ కొట్లాడి సాధించుకుంటామని అభ్యర్థుల్లో భరోసా నింపారు. అనుక్షణం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా నేనుంటానని ఎవ్వరికి భయపడేది లేదని ధీమానిచ్చారు. బీజేపీ మతం రంగుతో ఓట్లు అడుగుతుందని కానీ తమది సెక్యూలర్ పార్టీ అని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో దోస్తీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పలు జిల్లాల్లో పర్యటించి మెదక్‌లో ఓటమి భయంతోనే మొహం చాటేశాడని అన్నారు.

ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి నిరంకుశ పాలనకు జరుగుతున్నవని ప్రజలు ఆలోచించి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఎవ్వరు అదైర్యపడవద్దని మున్ముందు బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మరింత అభివృద్ధి సాధించుకుందామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అద్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చంద్రాగౌడ్, మల్లిఖార్జున్‌గౌడ్, సురేందర్‌గౌడ్, బట్టి జగపతి, మామిళ్ల అంజనేయులు, సోహెల్, జుబేర్‌లతోపాటు అన్ని వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story