ప్రభుత్వ వైఫల్యం వల్లనే హైదరాబాద్ జల దిగ్బంధం: హరీష్ రావు

ప్రభుత్వ వైఫల్యం వల్లనే హైదరాబాద్ జల దిగ్బంధం: హరీష్ రావు
X
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తీవ్ర

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని, నేరపూరిత నిర్లక్ష్యమని ఘాటుగా విమర్శించారు. వాతావరణ శాఖ ముందుగానే తీవ్ర వర్షాలు కురుస్తాయని హెచ్చరించినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. వరద తీవ్రతను అంచనా వేయడంలో, ప్రణాళికలు రచించడంలో, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ముందుచూపు లోపం వల్లే పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఎంజిబిఎస్ బస్టాండులో వరద నీటిలో చిక్కుకుని రాత్రంతా భయంతో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బురద రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి, సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. మూసీ పరిసర ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రజలను గుర్తించి, వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.


టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు మరో ప్లాన్

ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్లాన్ వేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఏకంగా 15వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ మరో స్కాంకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. లక్షల కోట్లు విలువ చేసే, వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు దారాదత్తం చేసేందుకు రేవంతు మార్కు భారీ స్కెచ్ వేసిందని పేర్కొన్నారు. ఓపెన్ బిడ్లు పిలవలేదు, అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదని అన్నారు. ఈ స్కాం సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతామని వెల్లడించారు.

Tags

Next Story