కౌలు రైతు వీరన్నది ఆత్మహత్య కాదు..ప్రభుత్వం చేసిన హత్యే: హరీష్ రావు

Harish Rao comments congress
X

Harish Rao comments congress

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగుతూ పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమని అన్నారు. వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం, మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story