వరద పోతుంటే.. బురద రాజకీయాలా?

వరద పోతుంటే.. బురద రాజకీయాలా?
X

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం గోదావరి నది లో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నందున మోటార్లు నడిపి రిజర్వాయర్లను నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సూచించారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని అన్ని మోటార్లను నడిపి నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రికి ఆయన లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నదని, జలకళతో కనిపించాల్సిన రిజర్వాయ ర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయంటే దానికి కారణం నీటి నిర్వహణలో మీ ప్రభుత్వ వైఫల్యమే అని మంత్రి ఉత్తమ్ ను ఉద్దశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎల్ నినోను సాకుగా చూపకుండా, అందివచ్చిన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా ఆన్-ఆఫ్ పద్ధతిలో కాకుండా 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని డిమాండ్ చే శారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకోవాలనే ఉద్దేశంతో కెసిఆర్ కాళేశ్వరం ప్రాజె క్టు వ్యవస్థను నిర్మించారని,ఇందులో భాగంగా 141 టిఎంసిల సామర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు.

గోదావరిలో వరద వచ్చినప్పు డు ఆ నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను నింపితే రైతుల కు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఒకవై పు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు గోదావరిలో భారీ వరద ప్రవాహం ఉన్నా, ఆ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నీళ్లు అందక పంట లు ఎండిపోతుంటే మీరు మాత్రం ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ పంటలు ఎండగొడుతున్నారని మంత్రి ఉత్తమ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. గోదావరి జలాలను లిఫ్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఒకవైపు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంటే, మరోవైపు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉన్నాయని అన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 13 టిఎంసిలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుందని, ఇక్కడ 50 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అందుబాటులో ఉందని వివరించారు. మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు, మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టిఎంసిలకు కేవలం 6 టిఎంసిలే ఉన్నాయని,


ఇక్కడికి సైతం నీటిని ఎత్తిపోస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఎల్లంపల్లిలో నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తే మిడ్ మానేరు సహా అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడంతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల దాదాపు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి దోహదం చేసినట్లవుతుందని తెలిపారు. మిడ్ మానేరు దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్.ఎం.డి.)లో ప్రస్తుతం 11 టిఎంసిలు మాత్రమే ఉన్నాయని, ఇక్కడికి నీటిని తరలిస్తే కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ -మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లోని రైతులు, ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారని మంత్రికి సూచించారు.

సాగు నీళ్లు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించుకోవద్దు

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, అయితే రంగనాయక సాగర్‌లో నీళ్లు లేకపోవడం వల్ల పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహణ ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ పరిస్థితితో పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి కోసం రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం నదుల్లో వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయకుండా కిందకు వదిలిపెడుతున్నదని ఆరోపించారు. ప్రస్తుతం గోదావరి నదిలో ఎల్లంపల్లి వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నదని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం ఆలోచించాలని, ప్రకృతిపై నెపం నెట్టి రైతులకు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యత నుంచి తప్పించుకోవద్దని హరీశ్‌రావు మంత్రి ఉత్తమ్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story