రేవంత్ 1000 రోజుల పాలనలో ప్రజలకు తీరని నష్టం

రేవంత్ 1000 రోజుల పాలనలో ప్రజలకు తీరని నష్టం
X

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలన, -6 గ్యారెంటీలు-, -420 హామీల మోసం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో నిర్వహించిన సదస్సు, వంటావార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, వికలాంగులతో సమావేశం నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2,500, కెసిఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో తులం బంగారం, రూ.500కే వంటగ్యాస్, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు.

33 నెలలుగా మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున బకాయి పడిన రూ.82,500ను, వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు చేయూత పెన్షన్ల రూపంలో బకాయి పడిన రూ.66 వేలనూ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల హామీలను అమలు చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మహిళలు, వృద్ధులు, వికలాంగుల తరఫున బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, బకాయిలన్నీ చెల్లించే వరకు విశ్రమించేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.


Tags

Next Story