ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం: హరీశ్ రావు

తమపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని సిద్దిపేట ఎంఎల్‌ఎ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిఎం రేవంత్ రెడ్డి వస్తే రుణమాఫీ కానీ వేల మంది రైతులకు రుణమాఫీ చేసే వరకు అక్కడే కూర్చుంటామని హెచ్చరించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22 వేల మంది రుణమాఫీ కాని రైతులు ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. కెసిఆర్ పాలనలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం నర్మెట్ట గ్రామంలో 65 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు 300 కోట్ల రూపాయలను మంజూరు చేసి శంకుస్థాపన చేశామని అన్నారు. అయితే, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తామే ఏర్పాటు చేస్తున్నామని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఆయిల్ ఫ్యాక్టరీలో ఇప్పటికే 3,500 గెలల క్రషింగ్ జరిగి ప్రస్తుతం 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోందన్నారు.
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వేలాదిమంది పోలీసుల బందోబస్తులో వెళ్లిన రేవంత్‌కు సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నమ్మించి ఇప్పుడేమో నయవంచన చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్‌గా మార్చారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుండి మళ్లీ కరెంటు కోతలు పెరిగిపోయాయని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థ అస్తవ్యస్తమైందని అన్నారు. ఆయన వెంట నాయకులు వేలేటి రాధాకృష్ణ, జాప శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేష్ గౌడ్, దువ్వల మల్లయ్య తదితరులు ఉన్నారు.
-
Home
-
Menu
