మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను శనివారం రాత్రి అరెస్టు చేశారు. సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆయన నివాసం వద్ద అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి అంబటి రాంబాబును నల్లపాడు పిఎస్‌కు పోలీసులు తరలించారు. అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకునే నేపథ్యంలో వైసిపి, టిడిపి నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంబటి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.


అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించిన టిడిపి నాయకులు

మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని నవభారతనగర్‌లోని అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తండ్రిపై అంబటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడ్డంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. టిడిపి శ్రేణులు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంట్లోని కిటికీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. ఇంటివద్ద ఉన్న అంబటి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు ఆందోళన దిగారు. దీంతో అంబటి రాంబాబు వెంటనే సిఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టిడిపి అభిమానులు ఆందోళన చేపట్టారు. మహిళా కార్యకర్తలు, నాయకులు అంబటి నివాసం వద్దకు చేరుకుని ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న కారు, ఇతర వాహనాలను ధ్వసం చేశారు.

ఘాటుగా స్పందించిన వైసిపి...డిజిపికి ఫిర్యాదు

గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించి కారు, ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనపై వైసిపి పార్టీ తీవ్రంగా ఖండించింది. వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ అంటిరాంబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ దాడిని ఖండించారు. కాగా ఈ ఘటనపై డీజీపీకి వైసీపీ లేఖ రాసింది. గుంటూరులో పరిస్థితి చేయి దాటిపోతోందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, ఆయనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది. అంబటికి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరింది. సంఘ విద్రోహ శక్తులు అంబటి ఇంటిపై దాడి చేశాయని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ, డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

Tags

Next Story