మంత్రి కారుపై రాళ్లతో దాడి

ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలను నిర్వహించి, ఎన్నికల ఫలితాలను ప్రకటించగా గెలుపును స్వీకరించాల్సిన నేతలు అధికారం కొరకు అప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహారించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగా, అధికారం కోసం ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా నేతలు వ్యవహారించడం పట్ల ఆగ్రహాం వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల నిర్వహాణలో మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటి అధికారం చేజిక్కుంచుకునే ప్రయత్నంలో క్యాతన్‌పల్లి ప్రాంతంలో మంగళవారం యుద్దభూమిని తలపించింది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలో 22 వార్డులు ఉండగా బిఆర్‌ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7 వార్డులు, ఒక్కరు స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ కావాలంటే 12 వార్డు సభ్యులు ఉన్న చైర్మెన్ పదవి దక్కుతుంది. కాగా ఇక్కడ బిఆర్‌ఎస్, సిపిఐ పొత్తు ఉండడంతో ఇరువురికి కలిపి 14 వార్డులు ఉన్నాయి. దీంతో బిఆర్‌ఎస్ కు చైర్మెన్ పదవి అనివార్యం అనుకున్న నేపధ్య ంలో ఇక్కడ రెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ చైర్మెన్ పదవి కొరకు అనేక ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తుండగా బిఆర్‌ఎస్, సిపిఐ మాత్రం ఒక్కతాటిపై ఉండడంతో ఇక్కడ సామ, దాన, దండోపాయ విధానాలకు తెరతీశారనే వాదనలు వినవస్తున్నాయి. సోమవారం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక ఉన్నప్పటికీ కోరం లేక పోవడంతో వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు మద్య ఎవరికి అనుమతులు ఇవ్వకుండా పకడ్బందీగా అధికారులు ప్రణాళిక చేపట్టారు. ఈ నేపద్యంలో బిఆర్‌ఎస్, సిపిఐ లకు చెందిన వార్డు సభ్యులను కార్యాలయం వరకు తీసుకుని వెళ్లేందుకు ఇతరులకు అనుమతులు ఇవ్వక పోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సిపి ఆదేశాల మేరకు వాహనాల డ్రైవర్ల తో వార్డు సభ్యులను కార్యాలయానికి పంపించారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు వందల మీటర్ల దూరంలోను అందరిని ఆపి వేయడంతో అక్కడే కాంగ్రేస్, బిఆర్‌ఎస్, సిపిఐ శ్రేణులు ఉండి పోయారు. ఈ నేపద్యంలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా అక్కడ యుద్దభూమిని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో బిఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసుల లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. అలాగే కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రేస్ నాయకులు జావేద్ కూడా ఘర్షణ వాతావరణంలో తీవ్రంగా గాయపడ్డారు, కానిస్టేబుల్ రాకేష్, జావేద్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి వివేకానంద, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ కార్యాలయానికి ఓటు వేసేందుకు చేరుకున్నారు.
అధికారులు, 22 మంది వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక విషయమై లోపల ఇరు వర్గాల మధ్య జరిగిన వాదోపవాదాలతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మందమర్రి తహాసిల్దార్ సతీష్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు, మంత్రి వెళ్తున్న సమయంలో మంత్రి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు స్వల్పంగా ధ్వసంమైంది. మెజారీటీ ఉన్నప్పటికీ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను నిర్వహించకుండా అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తసు పలుకుతున్నారని బిఆర్‌ఎస్, సిపిఐ వార్డు సభ్యులు కార్యాలయం బయటకు రాకుండా ఆందోళనకు దిగారు. సిపిఐ కి చెందిన వార్డు సభ్యులు తమను కావాలని రెచ్చగొట్టి బయటకు వస్తే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, దానిని వదిలి వేసి కోరం ఉండి మెజారిటీ ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికలను వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
Home
-
Menu
