ఉప్పల్‌లో హైటెన్షన్.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలకు బ్రేక్!

వేడుకలకు పోలీసుల అనుమతి నిరాకరణతో వివాదం.. అధికారులతో ఎమ్మెల్యే వాగ్వాదం.. ఉప్పల్‌లో ఉద్రిక్త వాతావరణం
మన తెలంగాణ – నాచారం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల నిర్వహణ స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పుట్టినరోజు వేడుకల కోసం బీఆర్ఎస్ శ్రేణులు చేసిన ఏర్పాట్లకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే పోలీసు అధికారులను ప్రశ్నించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
నవంబర్ 27న ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నల్లచెరువు సమీపంలో బీఆర్ఎస్ నాయకులు వేడుకలకు ఏర్పాట్లు చేపట్టారు. తొలుత ప్రభుత్వ స్థలంలో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా హైడ్రా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలంలో ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ కూడా పోలీసుల నుంచి అనుమతి లేదని చెప్పడంతో నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతుల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ముందుగానే దరఖాస్తు చేసుకున్నప్పటికీ చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉప్పల్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఏసీపీ వెంకట్‌రెడ్డితో చర్చించారు.
అదుపులోకి తీసుకున్నారా?
ఈ పరిణామాల మధ్య ఉప్పల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యేతో బిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. జన్మదిన వేడుకల నిర్వహణకు అనుమతుల వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పోలీసుల నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రాధాన్యమని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
Home
-
Menu
