కరెంట్ షాక్ తో హోంగార్డ్ మృతి

Electric shock
X

Electric shock

వికారాబాద్ జిల్లా ఎస్‌పి కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సిహెచ్. శ్రీనివాస్ (40) మంగళవారం పోలీస్ వాహనాన్ని శుభ్రం, కడుగుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి పోలీసులు వెంటనే వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. 2007 నుంచి హోంగార్డుగా వికారాబాద్ జిల్లా ఎస్‌పి కార్యాలయంలో విధులను నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య మాధవి, ఇద్దరు పిల్లలు కూతురు భవ్యశ్రీ (7), కుమారుడు (5) ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యాన్ని కల్పించారు.

హోం గార్డ్ కుటుంబ సభ్యులను ఆదుకుంటాం

హోం గార్డ్ సిహెచ్. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని జిల్లా ఎస్‌పి కె.నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హోంగార్డు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయం లోని ఎంటి సెక్షన్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్)లో విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన హోం గార్డ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని పూర్తి భరోసా కల్పించారు. శ్రీనివాస్ హఠాత్ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఇది పోలీస్ శాఖకు కూడా తీరని లోటన్నారు. మృతుని మరణానికి సంబంధించి ఉన్న అనుమానాలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో కరెంట్ షాక్‌కు గురై మరణించారా, మరేదైనా ఇతర కారణంతో మృతి చెందారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని అన్నారు.

ఈ కేసులో వాస్తవాలు తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి అయిన పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్ తుది నివేదిక కీలకం అవుతుందని, ఆ నివేదిక వచ్చే వరకు ఎలాంటి ముందస్తు నిర్ధారణకు రావద్దన్నారు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అధైర్య పడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని తెలిపారు. కేసు దర్యాప్తు విషయంలో, శాఖాపరమైన సహకారం అందించడానికి తాము అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, హోంగార్డు అసోసియేషన్ తరపున ఒకరోజు వేతనాన్ని బాధిత కుటుంబానికి అందజేసేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags

Next Story