కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన కోడలిని స్వంత మామే గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలండి లచ్చయ్య, అనసూర్య దంపతుల కుమార్తె శ్రావణి (23), అదే గ్రామానికి చెందిన శివర్ల సత్తయ్య, సత్తక్క దంపతుల చిన్న కొడుకు శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రావణి 9 నెలల గర్భిణి. వచ్చే నెల వైద్యులు ప్రసవం కోసం ఆమెకు డేట్ కూడా ఇచ్చారు. అయితే, శ్రావణి, శేఖర్ కులాలు వేర్వేరు కావడంతో శేఖర్ తండ్రికి వీరి వివాహం ఇష్టం లేదు. శ్రావణి ప్రస్తుతం వారి తల్లిగారింటిలో ఉంది. వారి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసిన మామ సత్తయ్య గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. కాగజ్‌నగర్ డిఎస్‌పి వహిదుద్దీన్, సిఐ కుమార స్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు శ్రావణి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
