భక్తజన సంద్రంగా మేడారం..

భక్తజన సంద్రంగా మేడారం..
X

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలనుండి మన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులతో ఆదివారం మేడారం భక్తజన సంద్రమైంది. సాధారణంగా జాతర రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని భావించే వేలాది కుటుంబాలు ముందుగానే అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలనుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహినితో పులకించిన మేడారం... రాబోయే మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు ముందస్తుగా మేడారం బాట పట్టారు. ఆదివారం ఉదయం నుండే మేడారంలోని గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్‌లో గంటల తరబడి వేచివున్నప్పటికీ భక్తులు ఎంతో క్రమశిక్షణతో అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర తేదీలు సమీపిస్తున్నకొద్దీ భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది.


జంపన్న వాగులో పుణ్యస్నానాలు...

మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమను చల్లగా చూడాలని కోరుకుంటూ వాగులో స్నానాలుచేసి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. జంపన్నవాగులో నీటిమట్టం పెరగడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

నిలువెత్తు బంగారం నైవేద్యం...

సమ్మక్క సారలమ్మకు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా భావించి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గద్దెలవద్దకు చేరుకున్న భక్తులు అమ్మవార్లకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కలు తీర్చుకుంటున్నారు. అడవిలో విడిదిచేసి భక్తిశ్రద్ధలతో వనదేవతలను ఆరాధిస్తున్నారు. మనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయం నుంచి జంపన్న వాగు వెళ్లే దారిలో రోడ్డు కిరువైపులా ఆట బొమ్మలతో షాపులు పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల పూసల దండలతో భక్తులు పూసలను ఆకర్షణ చూస్తూ కొంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ప్రైవేట్ వాహనాలు బారులుతీరాయి. వేల సంఖ్యలో వాహనాలు తాడ్వాయి మేడారం మీదుగా వచ్చే వాహనాలు వీఐపీ పార్కింగ్ వద్ద అంతరాయం ఏర్పడడంతో వీఐపీ పార్కింగ్‌లోని ఖాళీ స్థలాల్లోకి వాహనాలను పోలీసులు మళ్ళించారు. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో వీఐపి పార్కింగ్ వద్ద భారీకేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

Tags

Next Story