ఇడ్లీలు అమ్మే వ్యాపారిణికి రూ.91 లక్షల జిఎస్ టి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లా అంబూర్‌లో చిన్నపాటి ఇడ్లీ దుకాణం నిర్వహిస్తున్న ఓ వృద్ధ మహిళకు ఏకంగా రూ.91 లక్షల జిఎస్ టి బకాయి చెల్లించాలంటూ నోటీసు రావడం కలకలం రేపింది. తుత్తుపట్టిక చెందిన వసంత (60) అనే వృద్ధ మహిళ భర్త సెల్వం చనిపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఇడ్లీలు అమ్ముతూ కాలం వెళ్లదీస్తోంది. సెలంలోని జిఎస్ టి కార్యాలయం నుంచి రూ.91 లక్షలు జిఎస్ టి చెల్లించాలని నోటీసు రావడంతో ఒక్కసారిగా అవాక్కయింది. రోజుకు తాను రూ. 900 రూపాయల ఇడ్లీలు కూడా అమ్మడం లేదని రూ.91 లక్షలు ఎలా వస్తుందని ప్రశ్నించింది. వసంతకు సంబంధించిన బ్యాంకు ఖాతాను కూడా నిలిపివేయడంతో డబ్బులను డ్రా చేసుకోలేకపోతుంది. తనకు సంబంధం లేని భారీ వ్యాపార లావాదేవీల ఆధారంగా ఈ నోటీసు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా పరిశీలిస్తే, ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు వివరాల దుర్వినియోగం, నకిలీ సంస్థల ఏర్పాటు లేదా పన్ను వ్యవస్థలో జరిగిన పొరపాటు కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో మోసగాళ్లు నిరుపేదల గుర్తింపు వివరాలను దుర్వినియోగం చేసి భారీ లావాదేవీలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఆ పన్ను బకాయిలకు సంబంధించిన నోటీసులు అసలు గుర్తింపు వివరాలు కలిగిన వ్యక్తులకు చేరడం జరుగుతున్నట్లు అధికారులు, సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Tags
-
Home
-
Menu
