వయసు పెరుగుతోంది.. మెదడులో ఏం జరుగుతోంది?

Increasing age... what is happening in the brain?
X

Increasing age... what is happening in the brain?

63 లక్షలకు పైగా మెదడు కణాలపై అధ్యయనం.. చిన్నారి నుంచి 108 ఏళ్ల వృద్ధుడి వరకు పరిశీలన మనిషి వయసు పెరిగేకొద్దీ మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతుంది? అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి వ్యాధులకు దారితీసే మార్పులు మెదడులో ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మెదడులోని లక్షలాది కణాలపై విస్తృత అధ్యయనం చేశారు.

ఆలోచనలు, నిర్ణయాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే మెదడు ముందుభాగంపై పరిశోధకులు ప్రధానంగా దృష్టి సారించారు. తొమ్మిది అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని సమీకరించి, 1,494 మంది వ్యక్తులకు చెందిన 63 లక్షలకు పైగా మెదడు కణాలను విశ్లేషించారు. వీరిలో చిన్నారుల నుంచి 108 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు.

అన్ని కణాల్లో ఒకే మార్పు లేదు

వయసు పెరిగే కొద్దీ మెదడులోని అన్ని కణాలు ఒకే విధంగా మారడం లేదని పరిశోధకులు గుర్తించారు. కొన్ని కణాల్లో వాటి పనితీరును నియంత్రించే జన్యువుల్లో గణనీయమైన మార్పులు కనిపించగా.. మరికొన్ని కణాల్లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. అంటే మెదడు మొత్తం ఒకేసారి మందగించే ప్రక్రియ కాదని, వివిధ రకాల కణాలు వేర్వేరు వేగాలతో మారుతున్నాయని అధ్యయనం సూచిస్తోంది.

వ్యాధులను అర్థం చేసుకునేందుకు కీలకం

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో మెదడులో చోటుచేసుకునే మార్పులను అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌, స్కిజోఫ్రేనియా వంటి వ్యాధుల్లో కనిపించే మార్పులతో పోల్చేందుకు ఈ పరిశోధన ఉపయోగపడనుంది. భవిష్యత్తులో వ్యాధి లక్షణాలు బయటపడకముందే మెదడులో చోటుచేసుకునే కొన్ని మార్పులను గుర్తించే అవకాశాలను ఇది పెంచవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పరిశోధనను ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షగా పరిగణించలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

వయసు ఒక్కటే కారణం కాదు

మెదడు ఆరోగ్యంపై వయసుతో పాటు రక్తనాళాల ఆరోగ్యం, శారీరక చురుకుదనం, నిద్ర, ఆహారం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల మెదడు వృద్ధాప్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు వయసుతో పాటు జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యంలో మెదడు ఎలా మారుతుందో, వ్యాధుల్లో ఆ మార్పులు ఎలా భిన్నంగా ఉంటాయో అర్థం చేసుకునేందుకు ఈ భారీ అధ్యయనం కొత్త మార్గాన్ని చూపుతోంది. భవిష్యత్తులో మెరుగైన వ్యాధి గుర్తింపు పద్ధతులు, కొత్త చికిత్సల అభివృద్ధికి ఈ పరిశోధన దోహదపడే అవకాశం ఉంది.

అధ్యయనం ప్రత్యేకత

- 63 లక్షలకు పైగా మెదడు కణాల విశ్లేషణ

- 1,494 మంది వ్యక్తుల నమూనాలు

- చిన్నారుల నుంచి 108 ఏళ్ల వృద్ధుల వరకు పరిశీలన

- తొమ్మిది అధ్యయనాల సమాచారాన్ని సమీకరణ

- ప్రధానంగా పరిశీలించిన ప్రాంతం: మెదడులోని ముందుభాగం

Tags

Next Story