సమరోత్సాహంతో భారత్.. నేడు విండీస్‌తో రెండో టి20

రాంచీ: వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య భారత జట్టు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి టి20లో అలవోక విజయం సాధించిన టీమిండియా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక విండీస్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. తొలి టి20లో ఓడి పోవడంతో ఆత్మరక్షణలో పడింది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో బలమైన భారత జట్టును ఎదుర్కొవడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. అయితే టీమ్‌లో పలువురు టి20 స్పెషలిస్ట్‌లు ఉండడంతో విండీస్‌ను తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
అందరి కళ్లు శ్రేయస్‌పైనే..
తొలి టి20లో విధ్వంసక శతకంతో చెలరేగి పోయిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అందరి కళ్లు శ్రేయస్‌పైనే నిలిచాయి. కొంత కాలంగా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించడంలో విఫలమవుతున్న శ్రేయస్ కిందటి మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అయ్యర్ చెలరేగితే టీమిండియాకు విజయం నల్లేరుపై నడకే. ఇషాన్ కిషన్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ ఉండనే ఉన్నాడు. అతను కూడా జట్టుకు కీలకంగా మారాడు. అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. తొలి టి20లో వీరు పెద్దగా రాణించలేక పోయారు.
ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. తిలక్ వర్మ, శివమ్ దూబె, నమన్ ధిర్, అక్షర్ పటేల్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్, అక్షర్, మయాంక్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. మరోవైపు విండీస్‌కు మ్యాచ్ కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. కానీ తొలి టి20లో కెప్టెన్ షాయ్ హోప్, రూథర్‌ఫోర్ట్ తప్ప మిగతా వారు విఫలమయ్యారు. దీంతో విండీస్‌కు ఇబ్బందులు తప్పలేదు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సమష్టిగా రాణించాలనే పట్టుదలతో ఉంది.
-
Home
-
Menu
