74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా..

తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా జట్టు కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 101 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ డిక్వాక్ డకౌటయ్యాడు. ఆది నుంచే టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ సౌతాఫ్రికాను కోలుకోకుండా దెబ్బ తీశారు. సౌతాఫ్రికా బ్యాటర్ లో బ్రేవిస్(22 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 12.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 74 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, దూబేలు చెరో ఒక వికట్ తీశారు.
కాగా, అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు విఫలమవ్వగా.. తిలక్ వర్మ(26), అక్షర్ పటేల్(23), శివమ్ దూబే(23)లు పర్వాలేదనిపించారు. చివర్లలో హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సులతో చెలరేగిపోయాడు. పాండ్యా 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నెల 11న ఇరుజట్ల మధ్య రెండో టీ20 జరగనుంది.
-
Home
-
Menu
