రష్యా సైన్యంలో భారత్‌తో సహా 47 దేశాల పౌరులు

రష్యా సైన్యంలో భారత్‌తో సహా 47 దేశాల పౌరులు
X

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా, భారత్ సహా 47 దేశాలకు చెందిన పౌరులను ఉపయోగించుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశాలను ఈ యుద్ధంలోకి లాగకుండా అడ్డుకోవాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు. బుధవారం ఐరాస సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సాధారణ చర్చలో ఆయన ప్రసంగించారు.రష్యా మరో అత్యంత క్రూరమైన యుద్ధంలో తమ ప్రజలను ఉపయోగించుకునే అవకాశం ఉన్న దేశాలతో మాట్లాడాలనుకుంటున్నాను అని జెలెన్‌స్కీ అన్నారు. ఉత్తర కొరియాకు చెందిన వారే కాకుండా పలు దేశాల పౌరులు యుద్ధ ఖైదీలుగా తమ వద్ద ఉన్నారని తెలిపారు. ఘనా, నేపాల్, తజికిస్థాన్, భారత్, యెమెన్, కెన్యా, జింబాబ్వే, క్యూబా, బెలారస్, సూడాన్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన వారు రష్యా తరఫున పోరాడుతున్నారని పేర్కొన్నారు.

ఆయా దేశాల నుంచి పట్టుబడిన యుద్ధ ఖైదీలను స్వదేశాలకు పంపించాలని అప్పుడప్పుడు తమకు అభ్యర్థనలు వస్తున్నాయని చెప్పారు. ఇతర దేశాల పౌరులు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారని జెలెన్‌స్కీ అన్నారు. మోసం, తప్పుడు హామీలతో వారిని రష్యాకు తీసుకెళ్లి యుద్ధంలోకి దింపుతున్నారని ఆరోపించారు. 47 దేశాలకు చెందిన పౌరులు రష్యా తరఫున పోరాడుతూ యుద్ధభూమిలో మరణిస్తున్నారని పేర్కొన్నారు. రష్యా తమ పౌరులతో ఏం చేస్తోందో తెలుసుకుని, వారిని రక్షించాలని ఆయా దేశాల ప్రతినిధులను కోరారు. తమ పౌరులు మరో యుద్ధ రంగంలోకి వెళ్లకుండా చూడాలని, పుతిన్ తమ దేశాలను ఈ యుద్ధంలోకి లాగకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా యుద్ధానికి ఉపయోగించే నిధులు, వాణిజ్య అవకాశాలను పరిమితం చేయాలని సూచించారు.

భారతీయుల అంశంపై..

రష్యా సాయుధ దళాల్లో భారతీయులను నియమించుకుంటున్న అంశంపై భారత్, రష్యా మధ్య వివిధ స్థాయుల్లో, పలు సందర్భాల్లో చర్చలు జరిగాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ నెల ప్రారంభంలో తెలిపారు. అప్పటికి 227 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు సమాచారం ఉందని చెప్పారు. వీరిలో 139 మందిని సైన్యం నుంచి విడుదల చేసినట్లు, మరో 51 మంది మరణించినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న, తమ ప్రజలకు సహాయం చేస్తున్న ప్రతి దేశానికి జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాతో వాణిజ్యాన్ని పరిమితం చేయాలని దేశాలను కోరారు. తద్వారా యుద్ధానికి నిధులు సమకూర్చేందుకు మాస్కోకు లభించే ఆదాయ వనరులపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.

Tags

Next Story