ఇండిగో విమానాల సర్వీస్ 10 శాతం తగ్గింపు

న్యూఢిల్లీ/ముంబై : శీతాకాల షెడ్యూల్‌లో 10 శాతం విమాన సర్వీసులను తగ్గించుకోవాలని డిజిసిఎ ఆదేశించడంతో ఇండిగో తన విమానసర్వీసులను ఆ మేరకు తగ్గించుకుంది. ప్రస్తుతం రోజుకు నడుస్తున్న 2200 ఇండిగో విమాన సర్వీసుల్లో 200 కు పైగా రద్దవుతాయి. విమానయాన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇండిగో విమాన షెడ్యూల్‌ను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది. సవరించిన షెడ్యూల్‌ను బుధవారం అందజేయాలని డిజిసిఎ ఆదేశించింది.
2025-26 శీతాకాలం షెడ్యూల్ ప్రకారం రోజుకు 2200 విమానసర్వీసులను ఇండిగో నడపవలసి ఉండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 200 వరకు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని తేల్చి చెప్పారు. తగిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిజిసిఎ ఇప్పటికే ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఇండిగో విమానసర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రిఫండ్ చెల్లించాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే రూ750 కోట్ల రిఫండ్ ప్రయాణికులకు చేరిందని తెలిపారు.
-
Home
-
Menu
