ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి..ఇండిగో సీఈఒ

ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి..ఇండిగో సీఈఒ
X

ముంబై : దేశీయ విమాన సంస్థ ఇండిగో సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకుందని ఆ సంస్థ సీఈఒ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల , అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వేల మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ విషయమై సీఈఒ క్షమాపణలు కోరారు. ఇండిగో విమాన సర్వీసుల్లో ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని పీటర్ హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో విమానయాన సిబ్బంది అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రయాణికులే తమ తొలి ప్రాధాన్యమని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

గత కొన్ని రోజులుగా విమానసర్వీసులు రద్దవడంతో ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణికులకు రీఫండ్ చెల్లింపు పూర్తి చేశామని , అలాగే సదరు ప్రయాణికుల లగేజీ కూడా వారి నివాసాలకు చేరవేశామని తెలిపారు. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలనూ త్వరలోనే ఆయా ఇళ్లకు చేర్చడానికి తగిన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. తీవ్ర ఇబ్బందుల నడుమ డిసెంబర్ 5న 700 ఫైట్లను మాత్రమే నడప గలిగామని, అయితే సోమ,మంగళవారాల్లో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో మొత్తం 1800 విమానాలను అందుబాటు లోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం 138 గమ్యస్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

Tags

Next Story